క్విడ్ ప్రోకొ వద్దు.. క్విట్ జగన్!
posted on Aug 12, 2024 6:02PM
క్విడ్ ప్రొకో.. జగన్ కు తన వ్యాపార విస్తరణకే కాదు, రాజకీయాలలోనూ బాగా అచ్చి వచ్చింది. క్విడ్ ప్రొకో అండతోనే జగన్ కోట్లకు పడగలెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రీ కాగలిగారు. ఇప్పుడు విపక్షంలో కూడా తనను తాను కాపాడుకోవడానికి క్విడ్ ప్రొకోనే నమ్ముకున్నారు. ఔను ఇటీవలి ఎన్నికలలో జగన్ పార్టీ అత్యంత అవమానకరమైన ఓటమిని అందుకుంది. 2019 ఎన్నికలలో 151 స్థానాలతో తిరుగులేని విజయాన్ని అందుకున్న జగన్.. 2024 ఎన్నికలలో మాత్రం కేవలం 11 స్థానాలకు పరిమితమై కనీసం విపక్ష నేత హోదాకు కూడా నోచుకోలేదు.
ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తిరుగులేని నేతగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అంతే కాకుండా కేంద్రంలో కూడా ఆయన మాటకే ఎక్కువ చెల్లుబాటు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ మనుగడ తెలుగుదేశం పార్టీ మద్దతుపైనే ఆధారపడి ఉంది. దీంతో జగన్ పరిస్థితి దయనీయంగా మారింది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ బీజేపీతో అంటకాగి, రాష్ట్ర ప్రయోజనాలను ఆ పార్టీ అగ్రనాయకత్వం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ జాప్యం చేసుకోగలిగారు. ఇప్పుడు పార్టీ ఘోర పరాజయం తరువాత కూడా బీజేపీకి రాజ్యసభలో సరిపడినంత బలం లేదు కనుక అనివార్యంగా తమ పార్టీ మద్దతు కోసం తన డిమాండ్లకు తలఒగ్గుందని భావించారు. అందుకే లిట్మస్ టెస్ట్ చందంగా లోక్ సభలో బీజేపీ ప్రవేశ పెట్టిన వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకించి ఒక సంకేతం పంపారు.
లోక్ సభలో వైసీపీ వ్యతిరేకించినా ఆ బిల్లు ఆమోదానికి ఎటువంటి ఢోకా ఉండదు. ఆ విషయం స్పష్టంగా తెలిసిన జగన్ రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించకుండా ఉండాలంటే తనకు కొన్ని కండీషన్స్ ఉన్నాయని విజయసాయి రెడ్డి ద్వారా అమిత్ షాతో రాయబారం నడిపారు. అటునుంచి సానుకూల స్పందన వచ్చినట్లు లేదు. సరే ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు వచ్చే నెలలో 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో మెజారిటీ స్థానాలు ఎన్డీయే అభ్యర్థులే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఇక రాజ్యసభలో వైసీపీ మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం మోడీ సర్కార్ కు ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం రాజ్యసభలో 241 మంది సభ్యులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనందున నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక ఇటీవల 9 రాష్ట్రాలలో 12 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 229. వీరిలో బీజేపీ సభ్యులు 87 మందితో కలుపుకుని ఎన్డీయే సభ్యుల బలం 105. నామినేటెడ్ సభ్యులు ఆరుగురితో కలుపుకుని మొత్తం ఎన్డీయే బలం 111.
రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే మోడీ సర్కార్ కు మరో నలుగురు సభ్యుల మద్దతు అనివార్యం. వచ్చే నెలలో 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో కనీసం 11 స్థానాలలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే రాజ్యసభలో ఎన్డీయే బలం 122కు చేరుతుంది. అంటే ఎన్డీయేకు సొంతంగా అవసరమైన బలం చేకూరుతుంది. అప్పుడు బీజేపీకి వైసీపీ సభ్యుల మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో వైసీపీ అనుసరించే విధానం ఏమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.