జగన్మోహన్ రెడ్డికి రామోజీ సలహాలు అవసరమా!!!

 

రాజకీయంగా, వ్యాపారపరంగా కూడా బద్ధ విరోదులయిన రామోజీరావు, జగన్మోహన్ రెడ్డిల కలిసి కబుర్లు చెప్పుకోవడంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ప్రపంచం ఏ మూల ఎవరు ఎవరితో సమావేశమయినా తక్షణమే ప్రచురించే ఈనాడు, సాక్షి మీడియా రెండూ కూడా వారి అధినేతల సమావేశం గురించి మాత్రం ఒక్కముక్క కూడా పేర్కొనలేదు.

 

గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వారి సమావేశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ “రామోజీరావు చాలా పెద్దవారు. కనుక ఆయన సలాహాలు తీసుకొనేందుకు జగన్ వెళ్లి ఆయనని కలిస్తే తప్పులేదు. రామోజీరావుని జగన్ విమర్శించినట్లు నేను ఎన్నడూ వినలేదు. అయినా వారి సమావేశం గురించి మీడియాలో చాలా వార్తలు వచ్చేక ఇక దాని గురించి కొత్తగా మాట్లాడుకొనేందుకు ఏముంటుంది?” అని ప్రశ్నించారు.

 

రామోజీరావు, జగన్మోహన్ రెడ్డిల గురించి వారివారి మీడియాలు నిత్యం ఎన్ని విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటాయో ప్రజలందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి కంటికి రామోజీ చాలా గౌరవనీయులయిన పెద్దవారుగా కనబడటం, ఆయన సలహాలు అవసరం అవడం చాలా విచిత్రం అనుకొంటే వారి సమావేశాన్ని వైకాపా సమర్ధించుకోవడం ఇంకా విచిత్రంగా ఉంది. జగన్ అసలు పార్టీలో సీనియర్ నేతల సలహాలే పట్టించుకోరు అని పార్టీని వీడిన అనేకమంది సీనియర్ నేతలు చెపుతుంటే జగన్ తన బద్ద విరోధి అయిన రామోజీరావు సలహాలు తీసుకోవడానికి ఆయన్ని కలిసారని పెద్దిరెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ పెద్దిరెడ్డి చెప్పిందే నిజమనుకొంటే ఇకపై వారిరువురూ, వారి మీడియాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకుండా కలిసి పనిచేయబోతున్నారా, లేదా? అనే ప్రశ్నకు కూడా ఆయనే సమాధానం చెప్పగలిగితే అప్పుడు ఆయన మాటలకి అర్ధం ఉంటుంది. లేకుంటే ఏదో చాలా ముఖ్యమయిన కారణంతోనే బద్ద విరోదులయిన వారిద్దరూ సమావేశమయ్యారని భావించాల్సి ఉంటుంది.

 

వారు ఆవిధంగా సమావేశం అవడం ద్వారా రామోజీరావు తను ఎవరినీ శత్రువులుగా భావించడం లేదని, అదే విధంగా జగన్ తనకు అహంభావం లేదని ప్రజలకు తెలియజేసినట్లయిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ నిజానికి వారి సమావేశం ప్రజలకి, రాజకీయ పార్టీలకీ కూడా చాలా తప్పుడు సంకేతాలు పంపించింది. బద్ద విరోదులయిన వారిరువురూ ఊరికే కలవలేదని ఏదో చాలా ముఖ్యమయిన విషయంపై చర్చించేందుకే వారి తమ విరోధాన్ని కాసేపు పక్కన పెట్టారని అనుమానించక తప్పడం లేదు. ఆ బలమయిన కారణం ఏమిటో వారు ఇప్పుడు బయట పెట్టకపోయినా త్వరలోనే వేరే ఏదో ఒక రూపంలో అది బయటపడక తప్పదు.