జగన్ విశాఖ మకాం ముహూర్తం మళ్లీ మారింది!
posted on Oct 15, 2023 10:46PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుండి పాలన ఎప్పుడు అంటే వచ్చే నెలలోనే అనే మాట వినిపిస్తుంది. కానీ నాలుగేళ్లుగా ఇదే మాట వినిపిస్తుంది. కాకపోతే అప్పుడేమో విశాఖ రాజధాని, ఇప్పుడేమో విశాఖ నుండి సీఎం పాలన అని కాస్త మాట తేడా వచ్చింది. కానీ సీఎం మకాం మార్చేది ఎప్పుడంటే రేపే అన్నట్లే ఉంది. సరే నాలుగేళ్ల ముచ్చట అంతా పక్కన పెట్టేయండి.. ఈసారి గ్యారంటీ.. ఈ దసరాకే జగన్ విశాఖకు మారిపోతారని ఈ మధ్య ప్రభుత్వ వర్గాలు, మంత్రులు.. జగన్ జగన్ అంటూ నిత్యం భజన పనిలో ఉండే ఎమ్మెల్యేలు బల్ల గుద్ది చెప్పారు. ఇప్పటికే విశాఖలో రుషికొండపై సీఎం నివాసం, సీఎం క్యాంపు కార్యాలయం కూడా సిద్దమవుతున్నాయని, ఫైనల్ ఫినిషింగ్ పనులు మాత్రమే ఉన్నాయని అవి కూడా దసరాకి ముందే పూర్తి అవుతాయని వైసీపీ నేత కన్నబాబు అక్కడే ఉండి ఈ పనులన్నీ ఒంటి చేత్తో చక్కబెడుతున్నారని చెప్పుకొచ్చారు. సీఎం విశాఖ రాక కోసం వికేంద్రీకరణ జేఏసీ కూడా విశాఖపట్నంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేయాలని సమావేశం కూడా పెట్టుకుని నిర్ణయించుకుంది. అధికారులతో పాటు వైవీ సుబ్బారెడ్డి వంటి ముఖ్య నేతలు కూడా సీఎంకు తోడుగా విశాఖకు షిఫ్ట్ అవుతున్నారని చెప్పారు.
కానీ, ఈ దసరాకి కూడా జగన్ విశాఖలో అడుగు పెట్టే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. తాజాగా జగన్ సర్కార్ ఓ జీవో విడుదల చేసింది. విశాఖలో సీఎంకు, ఇతర అధికారులకు వసతి చూసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్లుగా జీవో జారీ అయ్యింది. మరోవైపు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఇదే విషయంపై కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ అక్టోబర్ లేదా నవంబర్ లో విశాఖకు వస్తారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. సీఎంతో పాటుగా వచ్చే అధికారులకు విశాఖలో వసతులు సమకూర్చాల్సి ఉందని.. వీటి కోసం ఒక కమిటీని ఏర్పాటు అయ్యిందని చెప్పారు. దీంతో ఇప్పట్లో జగన్ విశాఖ మార్పు కలే అంటూ చర్చ మొదలైంది. ఎందుకంటే, ఇప్పటికే విశాఖలో జగన్ కోసం ఇల్లు, క్యాంపు ఆఫీసు సిద్ధం అయ్యాయని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. మరోవైపు జగన్ ఏమో వసతి చూడాలని జీవోలు ఇస్తారు. విశాఖ నగరంలో అధికారుల కోసం కూడా ఇళ్ల వేట ఏడాది నుండే జరుగుతుంది. కానీ, జీవోలు మాత్రం ఇప్పుడు ఇచ్చారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు సీఎంకు దగ్గరి బంధువైన సుబ్బారెడ్డి ఈ నెలలో లేదా వచ్చే నెలలలో అంటున్నారు. కానీ, వచ్చే నెలలో కూడా అనుమానమే. ఎందుకంటే ఈ కమిటీ సీఎం కోసం వసతిని ఖరారు చేసి.. కమిటీ ముందుగా సిద్ధం చేసిన సిఫారసు కాగితాల్ని సీఎస్‌కు సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ వర్గాలు అక్కడ ప్రభుత్వం నడిచేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి, ఇతర అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి వసతులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఒక రాష్ట్ర పరిపాలన యంత్రాంగం మొత్తం తరలించాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. అవన్నీ సిద్ధం అయ్యాకే అక్కడ నుండి పరిపాలన సాగించాల్సి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే సీఎం జగన్ ఈ నెలలో విశాఖకు మకాం మార్చే విషయంలో వెనకడుగు వేశారని చెప్తుతున్నారు. నిజానికి దసరాకు ముందే జగన్ విశాఖ ఇంట్లో గృహప్రవేశం చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టేందుకు మరికాస్త సమయం పట్టేలా ఉండడంతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది.
అయితే, వచ్చే నెలకు అయినా విశాఖలో పనులు పూర్తి అవుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నవంబర్ లో మంచి రోజులు లేకపోవడం వంటి కారణాలతో అసలు వచ్చే నెలలో అయినా జగన్ విశాఖకు వెళ్తారా అన్న అనుమానాలు వ్వ్యక్తమవుతుండగానే.. డిసెంబర్ లో జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా వెళ్తారన్న మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. అంతేకాదు, డిసెంబర్ లో అమరావతి కేసుల విచారణ ఉందని, కోర్టులంటే జగన్ కు అపారమైన గౌరవం ఉందని, అందుకే డిసెంబర్ లో విచారణ తర్వాతే విశాఖకు వెళ్తారకథనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందు హావుడిగా విశాఖకు మకాం మారుస్తారంటే అంత నమ్మశక్యంగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా జగన్ అసలు విశాఖ ముచ్చటా నెరవేరేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.