జగన్ కు రెడ్ బుక్ జ్వరం.. జైలు భయం!

వైసీపీ  హ‌యాంలో  తెలుగుదేశం నేత‌ నారా లోకేశ్ పై  వైసీపీ నేత‌లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్స్ చేశారు.  మీడియా స‌మావేశాల్లో, స‌భ‌ల్లో  చంద్ర‌బాబు స‌హా నారా లోకేశ్‌ను టార్గెట్‌గా చేసుకొని ఇష్టారీతిలో మాట్లాడారు. ఇక  కొడాలి నాని, వల్ల‌భ‌నేని వంశీ, జోగి ర‌మేశ్‌, ఆర్కే రోజా, పేర్ని నాని వంటి నేత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వాళ్లు లోకేశ్ ను తిట్ట‌ని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.   ప‌ప్పు..  ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేడు.. అసెంబ్లీ గేట్లు కూడా తాక‌ లేడు అంటూ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌ల చేశారు. లోకేశ్ చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర‌ను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ, ప్ర‌భుత్వ కుట్ర‌ల‌ను తిప్పికొడుతూ తెలుగుదేశం పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల అండ‌దండ‌ల‌తో లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేశారు.

పాద‌యాత్ర స‌మ‌యంలో తెలుగుదేశం శ్రేణులు, ప్ర‌జ‌ల ప‌ట్ల వైసీపీ నేత‌లు, కొందరు అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో చ‌లించిపోయిన లోకేశ్‌.. రెడ్ బుక్‌ను ప్రారంభిచాడు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని హద్దులుదాటి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌లు, అధికారుల పేర్ల‌ను ఆ రెడ్ బుక్‌లో ఎంటర్ చేస్తూ వ‌చ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చివ‌రి స‌భ వ‌ర‌కు రెడ్ బుక్‌ను లోకేశ్ మెయింటెన్ చేశాడు. అప్ప‌ట్లో రెడ్ బుక్‌పై వైసీపీ నేత‌లు సెటైర్లు కూడా వేశారు. రెడ్‌బుక్ కు భ‌య‌ప‌డే వారెవరూ లేరు.  ఎన్ని రెడ్‌బుక్‌లైనా రాసుకో లోకేశ్.. అంటూ వైసీపీ నేత‌లు స‌వాళ్లు విసిరారు. కానీ సీన్ మారిపోయింది. లోకేశ్ రెడ్‌బుక్ అంటే వైసీపీ నేత‌లు, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌క్త అధికారులు వ‌ణికిపోతున్నారు.

లోకేశ్ రెడ్‌బుక్‌ పేరువింటేనే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైతం వ‌ణికిపోతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నెల రోజుల‌కే ఏపీలో అరాచ‌క పాల‌న జ‌రుగుతుందంటూ జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఆ ధర్నా సమయంలో లోకేశ్ రెడ్‌బుక్‌ను జగన్ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఆ త‌రువాత‌ కూడా వైసీపీ నేత‌ల స‌మావేశాల్లోనూ, మీడియాతో మాట్లాడిన స‌మాయాల్లోనూ పలుసార్లు రెడ్‌బుక్ గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తూ వ‌చ్చారు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జ‌రిగిన స‌మావేశంలోనూ రెడ్‌బుక్ గురించే ప్ర‌ధానంగా జ‌గ‌న్ చ‌ర్చించారు. రెడ్ బుక్‌తో వైసీపీ నేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వారికి అండ‌గా వైసీపీ లీగ‌ల్ సెల్ ప్ర‌తినిధులు ఉండాల‌ని జ‌గ‌న్ సూచించిన‌ట్లు తెలిసింది. రెడ్‌బుక్.. రెడ్‌బుక్ అంటూ ప‌దేప‌దే జ‌గ‌న్ మాట్లాడుతుండటంతో వైసీపీ నేత‌లు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ు.

ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు రెడ్‌బుక్ అంటే ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. ఇప్పుడు మాట్లాడితే రెడ్‌బుక్ అంటూ వ‌ణికిపోతున్నారని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  వైసీపీ   హ‌యాంలో అవినీతి అక్ర‌మాలు, భూక‌ బ్జాల‌కు పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రుపుతోంది. ఇప్ప‌టికే మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు అరెస్టు అయ్యారు. జోగి ర‌మేశ్ సైతం  నేడో రేపో అరెస్టు అవ్వడం ఖాయమం టున్నారు. అలాగే  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి భూక‌బ్జాల ఆరోప‌ణ‌లపైనా  విచార‌ణ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో పెద్దిరెడ్డీ జైలుకెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా ఇలా ఇలా వైసీపీ నేత‌లు ఒక్కొక్క‌రిపై వ‌రుస‌గా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో తొంద‌ర‌లోనే త‌న‌ వంతు కూడా వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

వైసీపీ ఐదేళ్ల పాలనలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేయ‌ని అరాచ‌కం లేదు. తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టి.. పోలీసుల‌తో కొట్టించాడు. కొందరిని జైళ్లకు పంపించాడు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం జెండా పట్టేందుకు సైతం ఎవరైనా భ‌య‌ప‌డాల్సి పరిస్థితులు ఉన్నాయి.  ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన ప్ర‌జ‌ల‌పైనా వైసీపీ నేతలు దాడులు చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. పలువురు వైసీపీ నేత‌ల దాడుల్లో  మరణించారు. మరింత మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  ఐదేళ్ల అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్‌..  ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తాను నీతివంత‌మైన పాల‌న సాగించాన‌ని చెప్పుకోవ‌టాన్ని చూసి వైసీపీ నేత‌లే ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  వైసీపీ లీగ‌ల్ సెల్ ప్ర‌తినిధుల స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ,  వైసీపీ హ‌యాంలో మనకు ఓటు వేయని వారికి కూడా  ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. మంచి జరిగే  పనులకు శ్రీకారం చుట్టాం. ఎక్కడా కూడా వివక్ష, అవినీతి చూపలేదు. న్యాయం, ధర్మం అన్నది అందరికీ ఒక్కటే అన్నట్లుగా మన  పాల‌న సాగింది, ఇవాళ మాత్రం న్యాయం కొందరికి మాత్రమే అన్న రీతిలో చంద్రబాబు పాలన ఉందని జ‌గ‌న్ చెప్పుకున్నారు.  జ‌గ‌న్ ప్రసంగం విన్న వైసీపీ నేతలు ఔరా అని ముక్కున వేలేసుకునేలా ఆయన ప్రసంగం సాగింది.  జ‌గ‌న‌న్న ఇంత నిస్సుగ్గుగా అబ‌ద్ధాలు ఎలా చెబుతారు అంటూ వారు నోరెళ్లబెట్టిన పరిస్థితి. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన రెండు నెల‌ల కాలంలోనే ఏపీలో అభివృద్ధి ప‌రుగులు పెడుతోంది.. శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయి. రాష్ట్రానికి కుప్ప‌లు తెప్ప‌లుగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. అన్నిటికీ మించి అధికార పగ్గాలు అందుకున్న రెండు నెలలలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ 5 సీఎంలలో ఒకరుగా నిలిచారు. అయితే జగన్ కు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు.  జగన్ నిత్యం ఏపీలో అరాచ‌క పాల‌న సాగుతున్నద‌ని ప్ర‌చారం చేయ‌డం, పదేపదే రెడ్ బుక్ గురించి తలచుకుని వణికిపోవడం చూస్తున్న   వైసీపీ నేత‌లు జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తీ సంద‌ర్భంలోనూ జ‌గ‌న్ రెడ్‌బుక్ గురించి ప్ర‌స్తావ‌న తెస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలపై జరుగుతున్న విచారణ, నేతల అరెస్టులకు కారణం రెడ్ బుక్ అని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ భయం చూసి  జ‌గ‌న్‌కూడా త్వ‌ర‌లో జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని, వైసీపీ రాబోయే రోజుల్లో క‌నుమ‌రుగు అవుతుందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.