గుజరాత్ సదస్సులో చంద్రబాబుపై ప్రశంసల వరద!

నిన్నమొన్నటి వరకు విజయవాడలో బుడమేరు వరదను ఎదుర్కొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద సోమవారం నాడు గుజరాత్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రశంసల వరద వచ్చిపడింది. ఆ ప్రశంసల వరదలో చంద్రబాబు నాయుడు తడిచిముద్దయ్యారు. ‘ఇన్వెస్ట్ ఇన్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్ ఇన్ ఎ క్లియర్ ఫ్యూచర్’ అనే అంశం మీద ఇన్వెస్ట్ 2024 పేరుతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన సదస్సులు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రిన్యూవబుల్ ఎనర్జీ మీద ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం అక్కడకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఎంతో నచ్చింది. ఎవ్‌రెన్ సంస్థ సీఈఓ సుమన్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి తన ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుమన్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగంలో ఎందుకు అంత స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర వున్న ఒకే ఒక సమాధానం సరిపోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన తన విజన్ చాలా క్లియర్‌గా వుంది. ఆయనకు రంగంలో వున్న చాలా స్పష్టత వుంది. ఒకరోజు అంతా వెచ్చిస్తే గానీ నేర్చుకోలేని విషయాలను చంద్రబాబు నాయుడు ఒక్క అరగంటలోనే అందరికీ అర్థమయ్యేలా వివరించారు. చంద్రబాబు నాయుడి ప్రసంగం వినడం వల్ల మాకు ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. సమయం కూడా ఆదా అయింది. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో నాకు అర్థం కావడం వల్లే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంతో అనువైన రాష్ట్రంగా నాకు అనిపిస్తోంది. అందుకే పెట్టుబడులు పెడుతున్నాను’’ అన్నారు.