ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరో సారి భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఆదివారం (ఆగస్టు 25) ఒకే వేదికపైకి రానున్నారు. శాంతి సరోవర్ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో ఇరువురు నేతలూ పాల్గొననున్నారు.  అంటే నెలన్నర   వ్యవధిలో  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురూ రెండో సారి ముఖాముఖి చర్చలు జరిపే అవకాశం ఉంది.  

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జులై నెలలో భేటీ అయిన సంగతి విదితమే. విభజన సమస్యలపై పరిష్కారం కోసం గత నెలలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరిగింది. విభజన సమస్యలపై చర్చకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించడం..  రేవంత్ రెడ్డి వెంటనే అంగీకరించడంతో  వీరిద్దరి మధ్య భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది. గత నెల ఆరో తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. విభజన సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతో ఒక కమిటీని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆ భేటీ సందర్భంగా రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి.  

జులై ఆరో తేదీ భేటీ తర్వాత ఈ నెల 25న మరో సారి ఇరువురు ముఖ్యమంత్రులూ ఎదురుప డుతున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగే శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలలో ఇరువురూ పాల్గొంటు న్నారు. అధికారికంగా ఇరువురి మధ్యా చర్చలు జరుగుతాయన్న సమాచారం లేకపోయినప్పటికీ, ఒకే వేదికపై ఎదురుపడిన సందర్భంగా ఇరువురూ విభజన సమస్యల పరిష్కారంపైనే మాట్లాడుకునే అవకాశం ఉంది. అంటే గత నెల 6న జరిగిన భేటీకి కొనసాగింపుగానే చర్చలు ఉంటాయనీ, ఈ భేటీతో విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో ముందడుగు పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.