మయన్మార్‌లో యాగీ తుఫాన్ విధ్వంసం!

భారీ వర్షాలతో మయన్మార్ (బర్మా) అల్లకల్లోలమైంది. ‘యాగీ’ అనే పేరుపెట్టిన తుఫాను మయన్మార్‌లో నానా యాగీ చేసింది. ఈ తుఫాను కారణంగా వరదలు పోటెత్తాయి. భారీ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో దాదాపు 226 మంది మరణించారు. ఇంకా 77 మంది గల్లంతైనట్లు మయన్మార్ అధికారిక మీడియా వెల్లడించింది. లక్షల్లో ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలారు. దాదాపు ఆరు లక్షల 30 వేల మంది ఈ తుఫాను వల్ల ప్రభావితమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి కూడా తెలిపింది. మయన్మార్ ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత దారుణమైన వరదలు ఇవేనని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

మయన్మార్ ఇప్పటికే అంతర్యుద్ధంతో సతమతమవుతెంది. ఈ యాగీ తుఫాను కారణంగా వేల ఎకరాల్లో పంట నాశనమైంది. రాజధాని నేపిడావ్ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు ఆహారం, తాగునీరు, సరైన ఆశ్రయం లేక బాధపడుతున్నట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. రహదారుల వంటి మౌలిక సౌకర్యాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశాన్ని ఆదుకోవాలని అక్కడి సైనిక పాలక వర్గం జుంటా విదేశీ సాయాన్ని అభ్యర్థించింది. యాగీ తుఫాను కేవలం మయన్మార్‌లో మాత్రమే కాదు... వియత్నాం, థాయ్‌లాండ్, లావోస్ దేశాల్లో కూడా విధ్వంసం సృష్టించింది. ఒక్క వియత్నాంలో 300 మందిని యాగీ కారణంగా మరణించారు.