కాదంబరి జత్వానీ కేసులో అప్రూవర్ గా విశాల్ గున్ని?

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో సస్పెండైన ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ అప్రూవర్ గా మారారా అంటే ఆయన వాంగ్మూలాన్ని బట్టి ఔననే అనాల్సి వస్తోంది. జత్వానీ అరెస్టు వ్యవహారంలో  తాను, మరో ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు ఆదేశాల మేరకే వ్యవహరించామని విశాల్ గున్ని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 

విచారణలో భాగంగా విశాల్ గున్ని మూడు పేజీల వాంగ్మూలంలో జత్వానీ అరెస్టు విషయంలో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించారు. తనపై అధికారుల ఆదేశాలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని స్పష్టంగా చెప్పేశారు. పై అధికారుల ఆదేశాలను శిరసావహించాననీ, అలా చేయకపోతే  ఏమౌతుందో తెలుసు కనుకనే వారు చెప్పిందల్లా చేశాననీ కుండబద్దలు కొట్టేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ తనను సీఎంవోకు పిలిపించిన దగ్గర నుంచీ ముంబై వెళ్లి కాదంబరి జెత్వానీనీ, ఆమె కుటుంబాన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చే వరకూ జరిగిన ప్రతి విషయాన్నీ ఆయన కళ్లకు కట్టినట్లు స్టేట్ మెంట్ ఇచ్చారు.  

సరిగ్గా కాదంబరి జెత్వానీని ముంబైలో కిడ్నాప్ చేసి ఇబ్రహీంపట్నం తీసుకురావడానికి రోజులు ముందు విశాల్ గున్ని విశాఖ రేంజ్ డీజీపీగా నియమితులయ్యారు. అయితే కాదంబరి జెత్వానీ విషయంలో ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తేనే విశాఖ రేంజ్ డీఐజీగా కొనసాగుతావని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు బెదిరించారు. జెత్వానీ అరెస్టుకు సంబంధించిన ప్రణాళిక అంతా తాడేపల్లిలోని అప్పటి సీఎంవోలో జరిగింది. ప్రణాళికను పీఎస్సార్ ఆంజనేయులు రూపొందిస్తే విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాలు అమలు చేశారు. 

అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత జత్వానీ ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. ఇక ఈ కేసులో సస్పెండైన విశాల్ గున్నీ వాంగ్మూలంతో  ఐపీఎస్ అధకారులు పూర్తిగా ఇరుక్కున్నారు. కేసు నమోదు కావడం కంటే ముందే ముంబైకి విమాన టికెట్లు బుక్ చేయడంతో ఇక తప్పించుకోలేని విధంగా చిక్కుకున్నారు. ఇక ఈ కేసులో విశాల్ గున్నీ తనను కాపాడుకోవడానికి అప్రూవర్ గా మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నారు. అదే జరిగితే.. జత్వానీ కేసులో ప్రమేయమున్న రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.