ఇంత కన్నా దిగజారుడుతనం ఉంటుందా?

తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.

ఆ తరువాత తల్లినీ చెల్లినీ దూరం నెట్టేసి ఈయనకు బంధుత్వాలు, అనుబంధాలూ కూడా లేవా అని జనం ముక్కున వేలేసుకునేలా చేశారు. సరే ఎవో కుటుంబ విభేదాలు, ఆస్తి తగాదాలు అనుకుంటే.. షర్మల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆమెను టార్గెట్ చేస్తూ ఆమె వ్యక్తిత్వ హననానికి సొంత సోషల్ మీడియా పాల్పడినా పట్టించుకోకుండా జగన్ తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు.

ఇక ఇప్పుడు పులివెందులలో నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్  చేసిన ప్రసంగం ఒక మనిషి ఇంత దిగజారగలడా అని ఆయన ప్రత్యర్థులు సైతం ఆశ్చర్య పడేలా చేసింది. తన ప్రసంగంలో జగన్ షర్మిల కట్టుకున్న చీరను సైతం ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు.   

షర్మిల పసుపు చీర కట్టుకోవడాన్ని కూడా తప్పుపడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ లెవల్ లో విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. పసుపు చీర కట్టుకున్న షర్మిల వైఎస్ వారసురాలు కాదు అని అర్ధం వచ్చేలా జగన్ మాట్లాడడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని  పక్కన పెట్టుకుని, ఆయనకు రక్షణగా నిలిచి పార్టీ టికెట్ ఇచ్చిన  జగనా వైఎస్ వారసత్వం గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా షర్మిల కట్టుకున్న చీరను సైతం జగన్ తప్పుపడ్డడాన్ని, వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపించారు. ఇక కొందరు నెటిజనులైతే జగన్ భార్య భారతి  పసుపు చీర కట్టుకుని ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తూ.. భార్యపైన కూడా అలాంటి వ్యాఖ్యలు చేయగలవా జగన్ అ ంటూ సవాల్ చేస్తున్నారు.