జగన్ షాక్ కు గుడ్లు తేలేసిన గుడ్డు మంత్రి!

విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా బొత్స కు టికెట్ ఇవ్వడం ద్వారా జగన్ మాజీ మంత్రి గుడివాడకు గట్టి షాక్ ఇచ్చారు. గుడ్డు మంత్రిగా యావదాంధ్రప్రదేశ్ లోనూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. జగన్ కు వీర భక్త హనుమాన్ వంటి వారు. ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత పార్టీ నేతలంతా అజ్ణాతంలోకో, మౌనవ్రతంలోకో జారుకుంటే గుడివాడ అమర్నాథ్ మాత్రం జగన్ పట్ల రాజుకు మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ జగన్ దృష్టిలో పడేందుకు శతధా ప్రయత్నించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నకలో తనకు చాన్స్ కోసం ప్రయత్నించారు.

అయితే జగన్ మాత్రం గుడివాడ విధేయత కంటే  బొత్స అనుభవమే ముఖ్యమని తేల్చారు. దీంతో గుడివాడ అమర్నాథ్ పూర్తిగా సైడైపోయారు. తనకు ఇవ్వకపోతే పోనీ నాన్ లోకల్ అంటే విశాఖ జిల్లాతో సంబంధం లేకుండా విజయనగరం నుంచి దిగుమతి చేసుకుని మరీ బొత్సకు టికెట్ ఇవ్వడం పట్ల అమర్నాథ్ అలకబూనారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గుడివాడ అమర్నాథ్ అలకను, మౌనాన్ని జగన్ ఇసుమంతైనా ఖాతరు చేయలేదు. పైపెచ్చు మాజీ మంత్రి, నియోజకవర్గ మాజీ ఇన్ చార్జ్  అయిన గుడివాడకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా బొత్స అభ్యర్థిత్వాన్ని ఖారు చేయడం ద్వారా జగన్ తన దృష్టిలో  గుడివాడకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో చెప్పకనే చెప్పేశారు.  దీంతో గుడివాడ ఇక పార్టీలో ఇమడలేక, బయటకు రాలేక గింజుకుంటున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి విశాఖ ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు.  కాలం కలిసొస్తే మరో మూడేళ్లు ఎమ్మెల్సీగా చక్రం తిప్పేయొచ్చు అని భావించిన గుడివాడ అమర్నాథ్ కు జగన్ నిర్ణయం గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

దీంతో  వైసీపీలో ఎంత కష్టపడినా బతుకు కరివేపాకు చందమేనన్న గ్రహింపు కలిగి నెమ్మదిగా బయటపడాలన్న నిర్ణయానికి వచ్చేసిన గుడివాడ, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీకి సహాయనిరాకరణ చేస్తున్నారనీ, దీంతో ఆయన వైఖరి ఇప్పటికే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో   మిణుకుమిణుకు మన్నట్లుగా ఉన్న వైసీపీ గెలుపు ఆశలు కొడికగట్టేసినట్లేనని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.  మొత్తం మీద గుడివాడ సైలెన్స్ వైసీపీ నుంచి మరో వికెట్ పడిపోవడం ఖాయమన్న భావన కలిగిస్తోంది.