సీబీఐ కోర్టులో జగన్ కేసుల రోజువారీ విచారణ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి కష్టాలన్నీ ఓకే సారి చుట్టుముడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలలో పరాజయంతో జగన్ కు మొదలైన బ్యాడ్ పీరియడ సుదీర్ఘ కాలం కొనసాగేలా ఉంది. ఇటు క్యాడర్ ను, అటు లీడర్ ను కూడా కాపాడుకోవడం ఎలాగో తెలియక సతమతమౌతున్న జగన్ రెడ్డికి ఇప్పుడు తన అక్రమాస్తల కేసు ను సీబీఐ కోర్టులో  రోజు వారీ విచారణకు రానుండటం మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారింది.

అసెంబ్లీలో బలం లేకపోతేనేం మండలలో మనదే ఆధిక్యం, ప్రభుత్వాన్ని గట్టిగా ఎదిరించండి, ఇరుకున పెట్టండి అని పరాజయం తరువాత తొలి రోజులలో ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చిన జగన్, ఆ తరువాత రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీలలో ఎందరు మన మాట వింటారో, మనతో ఉంటారో తెలియడం లేదు అంటూ బేల మాటలు మాట్లాడారు. ఫిరాయింపులను ఆపడం నా చేతుల్లో లేదంటూ చేతులెత్తేశారు. ఇక తాజాగా జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ రోజువారీగా చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనకు మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. మొత్తంగా సీబీఐ కోర్టులో జగన్ పై20 కేసులు సుదీర్ఘ కాలంగా విచారణ దశలోనే ఉన్నాయి. వాటిని త్వరిత గతిన విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.  

ప్రజా ప్రతినిధులపై పలు కోర్టులలో ఉన్న కేసులపై కూడా హైకోర్టు ఈ సందర్భంగా విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు గత ఏడాది హైకోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆయా కోర్టులను ఆదేశించింది. అలాగే విచారణకు సంబంధించిన నివేదికు సమర్పించాలని మూడు వారాల గడువు విధించింది.