ఏబీవీ పొలిటికల్ ఎంట్రీ.. జగన్ అక్రమాలను బయటకు తీస్తానని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు   ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు  ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవులు, అధికారం కోసం కాకుండా ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాలలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జగన్ హయాంలో  జరిగిన అక్రమాలు, అన్యాయాలు ప్రజల ముందుంచుతానన్నారు.   మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు.  జగన్‌తో తనకు వ్యక్తిగత కక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. తన విషయంలో  జగన్ చేయాలనుకున్నది చేస్తే.. తాను చేయాల్సిన పోరాటం చేశానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇక ఆ అధ్యాయం ముగిసిందనీ, ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైందన్నారు.  జగన్ అరాచకాలు  బయటకు తెస్తానన్నారు.

సండూర్ పవర్‌తో ఆరంభమైన జగన్ అక్రమ సంపాదన ఇప్పుడు లక్షల కోట్లకు చేరిందన్నారు.  అదంతా ప్రజల డబ్బే. దోచుకున్న సొమ్మును చట్టపరంగా బయటకు కక్కిస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  కోడికత్తి శ్రీను లాంటి బాధితులు జగన్ హయాంలో వేలల్లో ఉన్నారన్నారు. జగన్ బాధితులందరికీ తన వంతు సహకారం అందించి అండగా ఉంటానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ బాధితులు  తనకు సమాచారం అందించాలని కోరారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు.  అంతకు ముందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో కోడి కత్తి శ్రీనుతోపాటు అతడి కుటుంబ సభ్యులను  పరామర్శించారు.