పుంగనూరులో మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూకలు..ముగ్గురికి గాయాలు

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ మరోసారి రెచ్చిపోయింది.  పుంగనూరు మండలం కృష్ణాపురంలో టిడిపి కార్యకర్త రామకృష్ణ ఇటీవల వైసీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే వైసీపీ మూకలు మరో సారి రెచ్చిపోయాయి. తెలుగుదేశం సానుభూతి పరులపై కత్తులు, వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డాయి. ఈ దాడికి  మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు నారాయణ స్వామి నేతృత్వం వహించారు. ఈ దాడిలో తెలుగుదేశం కు చెందిన హరినాథ్, హరినాథ్ భార్య కన్యాకుమారి, వెంకటేష్ లు గాయపడ్డారు. క్షతగాత్రులను పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

ఇప్పుడు వైసీపీ మూకల దాడిలో గాయపడిన వారు ఇటీవల హత్యకు గురైన తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ బంధువులే కావడం గమనార్హం. గత కొంత కాలంగా తమపై దాడి చేసేందుకు పెద్దిరెడ్డి వర్గీయులు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని హరినాథ్ ఆరోపించారు. గతంలో హత్యకు గురైన రామకృష్ణ కూడా తనకు పెద్దిరెడ్డి మనుషుల నుంచి ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారనీ, అప్పడూ వారు పట్టించుకోలేదనీ ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.