పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు .. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై సస్పెన్ష్ వేటు

తిరుమలలో శనివారం (ఏప్రిల్ 12) జరిగిన అపచారానికి సంబంధించి బాధ్యులపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. అసలేం జరిగిందంటే. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు తిరుమల ఆలయం మహాద్వారం వరకూ పాదరక్షలతో వచ్చారు.  మహాద్వారం వరకూ భక్తులు రావడానికి ముందు మూడు ప్రాంతాలలో ఉన్న తనిఖీలను వారు దాటుకుని వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలతో మహాద్వారం వరకూ మధ్యలో తనిఖీలను దాటుకుని భక్తులు రావడంతో సిబ్బంది నిర్లక్ష్యం ప్రస్షుటమైంది. మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముఖేష్‌లు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చారు. శ్రీవాణి టికెట్‌పై వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 నుండి వీరు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే వీరు డిస్పోజబుల్ పాదరక్షలు ధరించి వచ్చిన సంగతిని అక్కడి సిబ్బంది గుర్తించి వారిని ఆపారు.  

అసలు మహాద్వారం వరకూ భక్తులు చెప్పులతో  వస్తుంటే విజిలెన్స్, టీటీడీ అధికారులు ఏంచేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది.  విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది.   ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంి, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేసింది.  అలాగే   నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బంది ఆరుగురిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదనలు పంపించింది.