జగన్ కు ప్రత్యేక చట్టాలున్నాయా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నెల్లూరు జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించి బయటకు వచ్చిన తరువాత మీడియా ఎదుట చాలా చాలా మాట్లాడారు. రాజకీయ పండితులు అయితే ఆ ప్రసంగం ఒక్కటి చాలు మరో ఆలోచన లేకుండా పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను జైలులో పడేయడానికి అని అంటున్నారు. ఆవేశంతో పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టడం తప్పెలా అవుతుందని ప్రశ్నించిన జగన్.. వైసీపీ కోసం ప్రత్యేక చట్టాలున్నాయని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆ చట్టాల ప్రకారం వైసీపీ నేతలు ఏమైనా చేయొచ్చు. దాడులకు పాల్పడవచ్చు. కానీ పోలీసులు మాత్రం కేసులు నమోదు చేయకూడదు అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

అటువంటి వ్యక్తి ఐదేళ్లు సీఎంగా ఎలా ఉన్నాడన్న ఆశ్చర్యం సర్వత్రా వ్యక్తం అవుతుంది. అదే సమయంలో ఈ ఐదేళ్లూ సీఎంగా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎందుకు ఏర్పాటు చేయలోదో కూడా జనానికి బాగానే అర్ధమైంది. ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఆయనకు తెలియదు. రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్లిపోవడమే. ఇంతోటి దానికి ప్రెస్ మీట్లు ఎందుకు అని భావించి ఉంటారు. ఇక ఆయనకు విలువలు, రాజ్యాంగం, చట్టం ఇలాంటి వాటితో పనీ లేదు. పరిచయమూలేదనడానికి నెల్లూరు జైలు బయట ఆయన మాటలు వింటే అర్ధం అవుతుంది. ఓ వైపు పిన్నెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారని అంగీకరిస్తూనే.. అక్కడ ఎమ్మెల్యేకు ఓట్లు పడటం లేదనీ.. అందుకే ఈవీఎంను పగులగొట్టి అన్యాయాన్ని ఎదిరించాడనీ సమర్ధిస్తున్నారు.  వాస్తవానికి పిన్నెల్లి ఈవీఎంను పగులగొట్టడం, ఆ తరువాత   అక్కడ ఉన్న తెలుగుదేశం ఏజెంట్ పై హత్య ప్రయత్నం చెయ్యడం వరకూ అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. అయితే పిన్నెల్లిని అరెస్టు చేయడం దారుణం అంటూ ఆవేశపడిపోయిన జగన్ కు అవేమీ కనిపించడం లేదు.  

ఈవీఎం   పగలకొట్టిన కేసులో పిన్నేల్లికి బెయిలు వచ్చింది కాబట్టి  మిగిలిన కేసులను పట్టించుకోవడం తప్పు అంటున్న జగన్ కు చట్టాలపై ఇసుమంతైనా గౌరవం కానీ, అవగాహన కానీ ఉన్నట్లు కనిపించదు.  ఇంకా ఆయన వ్యాఖ్యల సారాంశం ఏమిటంటే..   తమ అంటే తమ పార్టీ విషయంలో  పోలీస్ వ్యవస్థ, న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదు. తమకు అన్యాయం అనిపిస్తే  మేం చేసిందే చట్టం. మేం చెప్పిందే న్యాయం అనే అర్ధం చేసుకోవాలి. మేం చెప్పిన మాట వినలేదు కనుక కొడతాం. మాకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేస్తాం. గత ఐదేళ్లూ అదే చేశాం. ఎప్పుడైనా చట్టం, న్యాయం జోక్యం చేసుకున్నాయా? అన్నదే జగన్ నెల్లూరు జైలు బయట మాట్లాడిన మాటల  సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇలా చట్టాలను అతిక్రమించండి, ఇష్టారీతిగా రెచ్చిపొండి అని బహిరంగంగా తన పార్టీ వారికి జగన్ చెబుతున్నారంటే.. ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి  రాజకీయ లబ్ధి, సానుభూతి పొందాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు.