ఎన్‌సీసీ భూ కుంభ‌కోణం.. వైసీపీ నేత‌ల‌ అరెస్ట్ కు రంగం సిద్ధం?

వైసీపీ హ‌యాంలో భూ క‌బ్జాల ప‌ర్వం భారీగానే జ‌రిగింది. రాష్ట్రంలోని న‌లుమూల‌లా వైసీపీ నేత‌లు భూ క‌బ్జాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ భూముల‌తోపాటు, ప్రైవేట్ భూముల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కు కొట్టేశారు. గ‌తంలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం నేత‌లు వైసీపీ నేత‌ల భూ కుంభ‌కోణాల‌పై ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టారు. అధికార పార్టీ నేత‌లు కావ‌డంతో వారి జోలికి వెళ్లేందుకు అధికారులు సాహ‌సించ‌లేక‌పోయారు.  వైసీపీ పరాజయం పాలై  రాష్ట్రంలో తెలుగుదేశం  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. దీంతో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన భూ కుంభ‌కోణాలపై ప్ర‌భుత్వ పెద్ద‌లు కూపీలాగుతున్నారు. ఈ క్ర‌మంలో  భూక‌బ్జాల వ్య‌వ‌హారాలు ఒక్కటొక్కటిగా కుప్పతెప్పలుగా వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు పి. విజ‌య‌సాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో విశాఖ‌లో జ‌రిగిన భూ క‌బ్జా వ్య‌వ‌హారంపై తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి కేంద్రీక‌రించింది. పెద్ద ఎత్తున అక్ర‌మాలు, నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్లు గుర్తించింది. దీంతో ఆ భూముల‌ను తిరిగి స్వాధీనం చేసుకొని, అక్ర‌మాల‌కు స‌హ‌క‌రించిన‌ విజ‌య‌సాయిరెడ్డి, మ‌రికొంద‌రిపై కేసులు న‌మోదు చేసి అరెస్టు చేసేందుకు   రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది రోజుల‌కే  ఏపీలో మూడు రాజ‌ధానులు ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్నారు. విశాఖ‌ప‌ట్ట‌ణాన్ని ప‌రిపాల‌నా రాజ‌ధానిగా నిర్ణ‌యించి అక్క‌డి నుంచే పాల‌న కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వంలో  కొద్ది రోజులు షాడో సీఎంగా చ‌క్రం తిప్పిన విజ‌య‌సాయిరెడ్డి విశాఖ‌లో తిష్ట‌వేసి పెద్ద ఎత్తున భూ క‌బ్జాల‌కు పాల్ప‌డిన‌ట్లు గ‌తంలో తెలుగుదేశం నేత‌లు ఆరోప‌ణ‌లు చేశారు. దీనికి తోడు ఎన్‌సీసీ భూకుంభ‌కోణంలో విజ‌య‌సాయిరెడ్డి పాత్ర‌కూడా ఉన్న‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. విశాఖప‌ట్ట‌ణంలోని మధురవాడలో ఐటీ పార్కు, అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి 2005లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం టెండర్లు పిలిచి 97.35 ఎకరాల భూమిని ఎన్‌సీసీ సంస్థకు కేటాయించింది. ప్రభుత్వానికి ఎకరానికి రూ.93.20 లక్షల చొప్పున చెల్లించేందుకు ఎన్‌సీసీ, ఏపీహెచ్‌బీ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూమిని పూర్తి హక్కులతో ఎన్‌సీసీ సంస్థకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ ఆదాయానికి గండికొట్టి, వంద‌ల కోట్లు వైసీపీ నేతలు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి.

2005  నాటికి , 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటికి మధురవాడ రూపురేకలు పూర్తిగా మారిపోయాయి. అక్క‌డ‌ చదరపు గజం భూమి విలువ రూ.50 వేలకు తక్కువ లేదు. అయితే, ఈ భూముల‌కు సంబంధించి జ‌రిగిన రిజిస్ట్రేష‌న్ల‌లో భూమి విలువ‌ను బాగా త‌గ్గించి చూపించి స్టాంప్ డ్యూటీ  ఎగ్గొట్టారు. వాస్త‌వానికి రాష్ట్ర ప్ర‌భుత్వానికి రిజిస్ట్రేష‌న్ ఫీజుల కింద సుమారు రూ. 280 కోట్ల స్టాంప్ డ్యూటీ రావాల్సి ఉంది. కానీ, భూమి విలువ త‌గ్గించ‌డంతో కేవ‌లం రూ. 14కోట్లు మాత్ర‌మే ప్ర‌భుత్వానికి ఆదాయం వ‌చ్చింది. దీని వెనుక విజ‌య‌సాయిరెడ్డితోపాటు, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి కె. నాగేశ్వ‌రరెడ్డి త‌దిత‌రుల హ‌స్తం ఉంద‌ని తెలుస్తోంది. వీరంతా క‌లిసి మాజీ ఉప ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ త‌మ్ముడు జీపీఆర్ఎల్ కంపెనీ అధినేత కొట్టు ముర‌ళీకి రిజిస్ట్రేష‌న్లు చేశారు. కొంద‌రు అధికారులు కూడా స‌హ‌క‌రించి ప్ర‌భుత్వ  ఆదాయానికి భారీగా గండికొట్టారు. ఈ తంతుకు త‌ప్పుడు స‌మాచారంతో స‌హ‌క‌రించిన‌, ప్ర‌భుత్వాన్ని మోస‌గించిన అధికారుల‌ను గుర్తించే ప‌నిని కూట‌మి ప్ర‌భుత్వం ప్రారంభించింది. వారిపై చ‌ర్య‌లుకు రంగం సిద్ధం చేసింది.  

విశాఖ ఎన్‌సీసీకి చెందిన విలువైన భూముల‌ను వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో త‌ప్పుడు జీవోలు, నివేదిక‌లు, అనుమతుల‌తో సూట్ కేస్ కంపెనీల‌కు బ‌దిలీ చేసిన తీరుపై సీబీఐ విచార‌ణ చేప‌ట్టింది. ఈ భూముల వ్య‌వ‌హారానికి సంబంధించిన వివ‌రాల‌తో విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా సీబీఐ ఇప్ప‌టికే ఎన్‌సీసీ సంస్థ బాధ్యుల‌కు స‌మ‌న్లు జారీ చేసింది. దీనికితోడు సూట్ కేస్ కంపెనీల‌ను సృష్టించి భూములు కాజేసిన కొట్టు స‌త్య‌నారాయ‌ణ సోద‌రుడు ముర‌ళీకి నోటీసులు జారీ అయ్యాయి. సీబీఐతో పాటు ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించి విచార‌ణ జ‌రిపే ఈడీ కూడా రంగంలోకి దిగ‌నుంది. ఈ భూముల ఆధారంగా పెద్ద ఎత్తున మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల‌తో విచార‌ణ ప్రారంభించిన‌ట్లు తెలిసింది. దీంతో ఈ భూముల అక్ర‌మాల వెనుకఉన్న వైసీపీ నేత‌లు, అధికారుల అరెస్ట్ త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రో వైపు ఈ వ్య‌వ‌హారం త‌రువాత   భూ కేటాయింపుల‌ను ర‌ద్దు చేసే అవ‌కాశాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. విశాఖ ఐటీ పార్క్ కు ఆనుకొని అత్యంత విలువైన ఈ భూములు ఉండ‌టంతో భ‌విష్య‌త్ లో ఐటీ ప‌రిశ్ర‌మ విస్త‌ర‌ణ‌కు ఈ భూములు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దీంతో కుంభ‌కోణాల‌కు కార‌ణ‌మైన ఈ కేటాయింపుల‌ను ర‌ద్దు చేసి ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు భూముల‌ను కేటాయిస్తే వేలాది మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌డంతోపాటు.. ప్ర‌భుత్వానికి మంచిపేరు వ‌స్తుంద‌న్నఆలోచ‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం పెద్ద‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.