ఐసిస్ క్రూరత్వం.. 19 మంది అమ్మాయిలను సజీవ దహనం..
posted on Jun 7, 2016 12:23PM
ఉగ్రవాదుల అరాచకాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. ఇటీవలే తమకు లైంగిక బానిసలుగా ఉండటానికి ఒప్పుకోనందుకు 200 మంది అమ్మాయిలను అత్యంత కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు ఇప్పుడు మరో దారుణమైన పనికి ఒడిగట్టారు. ఇప్పుడు మరో 19 మంది అమ్మాయిలను చంపేశారు. మోసుల్ పట్టణంలో తమకు లైంగిక బానిసలుగా ఉండటానికి ఒప్పుకోని 19 మంది యాజిడి వర్గానికి చెందిన అమ్మాయిలను అనేక మంది చూస్తుండగానే ఇనుప బోన్లలో పెట్టి సజీవదహనం చేశారు. ఈ విషయాన్ని ఐఎస్ఐఎస్ మీడియా సమన్వయకర్త అబ్దుల్లా అల్-మల్లా వెల్లడించాడు.
కాగా, ఆగస్టు 2014లో సింజార్ పట్టణంపై దాడి చేసిన ఉగ్రవాదులు 3 వేల మంది యాజిడి వర్గపు యువతులు, అమ్మాయిలను కిడ్నాప్ చేసి తీసుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిలో వందల మంది ఇప్పటికే చనిపోగా, పదుల సంఖ్యలో తప్పించుకుని బయటకు రాగలిగారు. ఇంకా సుమారు 1800 మంది ఉగ్రవాదుల చెరలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇన్ని దారుణాలు జరుగుతున్నా..ఐసిస్ పై చర్యలు తీసుకునే వాళ్లు మాత్రం కనిపించడంలేదు. ఇంకా ఎంతమంది ఈ ఉగ్రవాదుల చేతిలో బలవుతారో చూడాలి.