ఇదే లాస్ట్ ఛాన్స్.. ఏపీ సర్కార్ పై సీజేఐ సీరియస్

దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన , న్యాయ వ్యవస్థను కలవరపరిచిన ధన్‌బాద్ జడ్జి హత్య కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై  ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయని రాష్ట్రాలపై లక్ష జరిమానా వేస్తామని, చీఫ్ సెక్రటరీలు కోర్టుకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించవచ్చని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

దేశవ్యాప్తంగా జడ్జిలు, న్యాయవాదులకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఎటువంటి రక్షణ తీసుకుంటున్నారో దానికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కొన్ని రాష్ట్రాలు అఫిడవిట్‌లు దాఖలు చేశాయి. ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఆ రాష్ట్రాలపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ అఫిడవిట్‌ల దాఖలుకు వారం రోజుల సమయం ఇస్తున్నామని, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీజేఐ ఆదేశించారు. ఇదే చివరి ఛాన్స్ అని కూడా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.