కేంద్రం ఉచ్చులో కేసీఆర్ సర్కార్ !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహా మేథావి. అందులో సందేహం లేదు. రాజకీయ ఎత్తులు వేయడంలో, ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో ఆయనకు ఆయనే  సాటి.. అందులోనూ ఎవరికీ అనుమానం అవసరం లేదు. అయితే, ఎందుకనో గానీ, కేంద్రంతో కావాలని కొని తెచ్చుకున్న వరి జగడం విషయంలో మాత్రం, ఆయన తప్పులో కాలేశారనే అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. ఢిల్లీలో కేసీఆర్  పప్పులు ఉడకలేదు, నవ్వులపాలయ్యారు అనే అభిప్రాయమే అంతటా వినవస్తోంది. 

నిజానికి ఏడేళ్ళుగా దాచుకున్న లోగుట్లు అన్నీ, ఒకటొకటిగా బయటకు వచ్చాయి. అంతే కాదు ఇంతవరకు ఎవరికీ కనిపించని  బొక్కలు,బలహీనతలు స్వయంగా ఆయనే  బయట పెట్టుకున్నారు,అనే మాట కుడా వినిపిస్తోంది. 
రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం వచ్చి ఏడేళ్ళు అయింది, అయినా, రాష్ట్ర రైతులు పండించిన వరి పంట మొత్తానికి మొత్తంగా కొంటోంది కేంద్ర ప్రభుత్వమే కానీ, కేసీఆర్ సర్కార్ కాదని, సామాన్య రైతులకు తెలియదు. ప్రతి పంట సమయంలో దేశంలో ఇంకెక్కడా లేని విధంగా చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని సభలోపలా, వెలుపలా ముఖ్యమంత్రి మొదలు, తెరాస నాయకులు అందరూ గొప్పలు చెప్పుకుంటే రైతులు కామోసు అనుకున్నారు. కానీ, ఇప్పుడు రైతులు పండించిన  ప్రతి గింజా కొన్నది,కొంటున్నది కేంద్ర ప్రభుత్వమని తేట తెల్లంగా అందరికీ తెలిసి పోయింది. ఇంతవరకు ముఖ్యమంత్రి సభలోపల వెలుపలా చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, కేంద్రం కాదంటే రాష్ట్ర ప్రభుత్వం గింజ కూడా కొనదు, కొనలేదు అనే నిజం కూడా  ప్రజలకు తెలిసి పోయింది. స్వయంగా ముఖ్యమంత్రి నోటి నుంచే ఆ మాట విని రైతులు, సామాన్య జనం ముక్కున వేలేసుకున్నారు.   

కేవలం కొద్ది నెలల క్రితం నిండు సభలో ... మీరు ఎంత వరి పండిస్తారో పండించండి.. ‘ఐ యామ్ హ్యపీ’ చివరి గింజ వరకు కొనే బాధ్యత నాది, అని లెక్కలు చెప్పి మరీ ముఖ్యమంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. వరికి డిమాండ్ ఉండదని ప్రత్యాన్మాయ పంటల వైపు వెళ్ళాలని చెప్పిన వారిని, తెలివి  తక్కువ ‘దద్దమ్మ’లని తేల్చేసారు. అలాంటి ‘సన్నాసు’ల మాటలు నమ్మద్దని రైతులకు సలహా కూడా ఇచ్చారు. కానీ, ఇప్పుడు అదే ముఖ్యమంత్రి వేసంగిలో వరి వేస్తే .. అది మీ ఖర్మ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కేజీ కూడా కొనదు, అసలు కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు  చేయదు అని చెపుతున్నారు. అదే విధయం వ్యవసాయ  మంత్రి పునరుద్ఘాటించారు. అంటే, కేంద్రం కాదంటే రాష్ట్ర ప్రభుత్వం కేజీ కూడ కొనలేదనే నిజం  రైతులకే కాదు సామాన్యులకు కూడా తెలిసొచ్చింది. అంటే ఇంతవరకూ చేసిన, ‘చివరి గింజ వరకూ కొంటాం ..వాగ్దానాలు, ‘ఐ యామ్ హ్యాపీ’ .. ఉపన్యాసాలు .. గింజ లేని వట్టి తాలు’ అని ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. 

ఇక ఇదే విషయంపై ఢిల్లీ ఫై యుద్ధం ... అంటూ గత నెల రోజులుగా సాగిన ప్రహసనంలో చివరకు పరాభవమే మిగిలిందనే అభిప్రాయమే ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులు, ఇతర నాయకులు కూడా వ్యక్త పరుస్తున్నారు. ముందు హైదరాబద్’లో మహా ధర్నా, అక్కడినుంచి ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రులు ఎంపీల ఢిల్లీ యాత్ర ... నాలుగు రోజులు  తర్వాత వట్టి చేతులతో హైదరాబాద్’కు తిరిగొచ్చారు. ఆతర్వాత మంత్రుల బృదం ఢిల్లీ వెళ్ళింది ..వచ్చింది. తెచ్చింది శూన్యం. పార్లమెంట్’లో ప్రాతం చుపిస్తామన్నారు నాలుగు రోజులు  నిరసనలు తెలిపి ఐదో రోజున... పార్లమెంట్ సమావేశమ బహిష్కరించి గాలి మోటారు ఎక్కారు. ఆ తర్వాత మంత్రులు మళ్ళీ ఢిల్లీ కి మళ్ళీ హైదరాబాద్’కు వృధా ప్రయాస యాత్రలు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఢిల్లీలో కాదు గల్లీలో తేలుస్తామని ఎంపీలు హైదరాబాద్ వచ్చారు. గల్లీలో కాదు డిల్లీలో తేలుస్తామని మంత్రులు డిల్లీ కొచ్చారు.. ఏడు రోజులుండి వట్టి చేతులతోనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. 
ఒక విధంగా ఢిల్లీ దండయాత్ర తెరాస నాయకత్వాన్ని నవ్వుల పాలు చేసింది. ఇంకా చెప్పాలంటే, తెరాస ప్రభుత్వం తమ తప్పులను తామే బయట పెట్టుకుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏమి కోరుతుందో ... ఎవరికీ తెలియక చిత్రంగా చూస్తున్నారు. ఒక సారి యాసంగి అంటారు .. ఒక సారి వానాకాలం  అంటారు, అసలు ఏమి కావాలో తెలియకుండా, కనీసం మంత్రుల్ అప్పాయింట్మెంట్ అయినలేకుండా ఢిల్లీ వెళ్లి అవమానించారని అంటారు.   అలాగే,గత యాసంగిలో ఇవ్వవలసిన బాయిల్డ్ రైస్ ఇంతవరకు రాష్ట్రం కేంద్రానికి  ఇవ్వలేదని, 2022 యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుతం లిఖిత పుర్వకంగా లేఖ ఇంచ్చిందని, ఇలా ఇంతవరకు గోప్యంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ లొసుగులు అనేకం వెలుగులోకి వచ్చాయి.  

అంతే కాకుండా ఇంతకాలం కేంద్ర ప్రభుత్వ పథకాలకు, సొంత పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకున్నా అది ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు, వరి వివాదంలో తెరాస ప్రభుత్వం డొల్లతనం బయటేసుకోవడంతో ... ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. నిజానికి ఏది ఎవరో ఎవరో అనడం కాదు, తెరాస నాయకులే గుసగుసలు పోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అల్టిమేట్’గా తెరాసకు ఏదైనా జరగరానిది జరిగితే, అది స్వయంకృతమే తప్ప మరొకటి కాదు. చేసుకున్న వారికీ చేసుకున్నంత.