డాన్స్ రాజా డాన్స్!!
posted on Apr 21, 2022 9:30AM
ఇప్పుడు డాన్స్ ఏంటి అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ డాన్స్ అంటేనే ఉత్సాహం, డాన్స్ అంటే ఒక సందడి, ఇంకా కొందరికి డాన్స్ అంటే ఒక ఎమోషన్. డాన్స్ తో మనిషికి ఉన్న అవినాభావ సంబంధం ఇప్పటిదేమీ కాదు. డాన్స్ కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. చతుష్షష్టి కళలలో డాన్స్ కూడా ఒకటి. అర్థమయ్యేలా చెప్పాలంటే అరవైనాలుగు కళలలో డాన్స్ కూడా ఒకటి మరి. ఇంకా లలిత కళలలో డాన్స్ అమ్మాయిల సొగసును అబ్బురంగా మార్చేస్తుంది. ఇప్పుడు డాన్స్ గురించి ఎందుకనే విషయానికి వస్తే డాన్స్ కు కూడా ఒక రోజును కేటాయించేసింది ఇంగ్లీష్ క్యాలెండర్.
దాని ప్రకారం మన ఏప్రిల్ నెలలో 29 వ తేదీన వరల్డ్ డాన్స్ డే ను జరుపుకుంటారట. ప్రత్యేకంగా ఒకరోజున ఇట్లా కేటాయించడం మనకు ఎలాగో నచ్చదు కానీ గుర్తు చేసుకుంటే మాత్రం బాగుంటుంది కదా!!
నిర్లక్ష్యం!!
ఒకప్పుడు కొన్ని కుటుంబాలలో సంప్రదాయం కింద సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి లలిత కళలు అమ్మాయిలకు, అబ్బాయిలకు చక్కగా నేర్పించేవారు. అయితే కాలం మారి ఉద్యోగాల గోలలు వచ్చి పడ్డాక చదవడం, ఉద్యోగం సంపాదించడం, ఉద్యోగానికి వెళ్లి రావడంతోనే జీవితం కూడా గడిచిపోతుంది. చిన్నప్పటి నుండి పిల్లలకు చదువుకోమని చావగొడుతూ ఇతర యాక్టివిటీస్ గురించి ఏమాత్రం ప్రోత్సాహం అదించకుండా ఉండటం వల్ల పెరిగేకొద్ది ఒకానొక కృత్రిమత్వం లో పడిపోయి పెద్దయ్యాక వాళ్లకు ఏమాత్రం జాలి, ప్రేమ, దయ వంటి గుణాలు కూడా లేకుండా తయారవుతున్నారు.
డాన్స్ మంత్రం!!
ప్రస్తుతకాలంలో టీవీ లలో ఎక్కడ చూసినా డాన్స్ షో లు పిచ్చపాటిగా టెలికాస్ట్ అవుతుంటాయి. ఈమధ్య కొందరు అభిప్రాయం ఏమిటంటే అవి డాన్స్ షోలా లేక, సర్కస్ షోలా అని. టీనేజ్ లో ఉన్నవాళ్లు అయితే స్టేజి మీద చేసే రొమాన్సులు, చిన్నపిల్లలకు కూడా టూ పీసెస్ డ్రెస్ లు వేసి డాన్స్ చేయిస్తూ ఉంటే అందరూ వాళ్ళను ఎన్నో రకాలుగా ఏదోఏదో అనేస్తారు. అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఒకానొక అభిరుచి అనేది ఉంటుంది. అలాంటిదే ఈ డాన్స్ కూడా. సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు వేస్తున్న డాన్స్ లకు ఏ మాత్రం తగ్గకుండా, ఇంకొందరు ముందడుగు వేసి అలాంటి దుస్తులే వెతికి తీసుకుని డాన్స్ ఇరగదీస్తుంటారు. ఇదంతా ఒక ఫాషన్ అయిపోయింది.
సంప్రదాయం!!
నిజానికి లలిత కళలలో డాన్స్ ఒకటి అయి ప్రాచీన వారసత్వ సంపదగా కొనసాగుతూ వస్తోంది. నాటి నాట్య రూపకాలను చూసి ముచ్చటపడి, విదేశీయులు కూడా భారతీయ నాట్యాలను నేర్చుకుంటున్నారు. మన దేశంలో ఎంతోమంది కళాకారులు నాట్యానికి అంకితమై, నాట్యంలోనే జీవించారు. నాట్యానికి ఉన్న గొప్పదనం అందులో ఎన్నో కథలను సృజియించడం. పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృతి, జీవన విధానాలు వీటన్నింటినీ నృత్య రూపంకంలో ప్రదర్శించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పైగా అందులో ఎంతో కళను బతికించే ఉద్దేశం, కళకు గుర్తింపు తీసుకురావడం కూడా ఉంటుంది.
ఉపయోగాలు!!
ఇట్లా ప్రాచీన నృత్యం అయినా, ప్రస్తుతం బీట్స్ మధ్య గంతులు వేసినా మొత్తం మీద మనిషి ఆరోగ్యానికి మాత్రం బోలెడు లాభం చేకూరుతుంది. పరిగెత్తడం, ఎగరడం నడుము తిప్పడం, వేగవంతమైన కదలికలు, స్లో మోషన్ లో వెలిబుచ్చే హవాభావాలు, దానికి తగిన భంగిమలు ఇలా అన్ని విధాలుగా శరీరం ఏకకాలంలో వ్యాయామం పొందుతుంది. ప్రతిరోజూ డాన్స్ ను ప్రాక్టీస్ చేసేవాళ్లకు ప్రత్యేకంగా వ్యాయామం అక్కర్లేదు.
ఉల్లాసం, ఉత్సాహం!!
డాన్స్ వేయడానికి మంచి సంగీతం కావాలి. మనిషి మూడ్ ను మార్చే శక్తి సంగీతానికి ఉంటుంది. ఆ సంగీతానికి శరీర కదలికలు కూడా తోడైతే మనుషుల్లో ఉన్న ఎన్నో రకాల ఒత్తిడులు ఇట్టే మాయమవుతాయి.
శరీరం అలసిపోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
శరీరంలో కొవ్వు శాతం ఉన్నవాళ్లు డాన్స్ మెల్లగా ప్రయత్నిస్తే ఎంతో ఫ్లెక్సిబుల్ బాడీ సొంతమవుతుంది.
మిగతా అన్ని పనులలో ఎంతో చురుగ్గా ఉండగలుగుతారు.
అన్నిటికంటే ముఖ్యంగా ఇష్టమైన పని చేశామనే తృప్తి లభిస్తుంది.
◆ వెంకటేష్ పువ్వాడ.