కొల్లాపూర్ లో మొదలైన మునిసిపల్ వేడి.. టీఆర్ఎస్ లో వర్గపోరు

అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరులో టిఆర్ఎస్ హవా నడిచింది. 14 సీట్లలో 13 స్థానాలను కైవసం చేసుకుంది. ఒకే ఒక సీటు కొల్లాపూర్ లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తరువాత రాజకీయ పరిణామాలు మారడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కొల్లాపూర్ లో ఓటమి పాలైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కోల్డ్ వార్ మొదలైంది. నియోజకవర్గంపై పట్టు కొనసాగించేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ పార్టీలోని కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోను హర్షవర్ధన్ రెడ్డి.. జూపల్లి కృష్ణా రావు వర్గాలు విడివిడిగా పోటీ చేశాయి. ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

మొదటి సారి కొల్లాపూర్ మున్సిపాలిటీకి జరిగే ఎన్నికలు కావడంతో అధికార పార్టీకి చెందిన ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. కౌన్సిలర్ అభ్యర్ధులతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్ధులను కూడా ఇరువర్గాల వారు ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య మునిసిపల్ ఎన్నికల్లో కూడా సయోద్య కుదిరే పరిస్థితి కనిపించటం లేదు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో 60-40 ఫార్ములా ప్రకారం తమ తమ వర్గీయులకు సీట్లు కేటాయించాలని ఒప్పందం జరిగినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. దీని పర్యవసానంగా టిఆర్ఎస్ జారీ చేసిన విప్ ను ధిక్కరించి మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది. ఆ తరువాత వ్యవహారం కోర్టు కేసు దాకా వెళ్లడంతో బీరం , జూపల్లి మధ్య వ్యవహారం మరింత బెడిసికొట్టింది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం బీరం , జూపల్లి వర్గీయులు వేరు వేరుగా పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రూపు రాజకీయాలు ఎటు వైపు టర్న్ తీసుకుంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ నేతల మధ్య ఉన్న వైరాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్.. బిజెపిలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడిన తరువాత రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తిగా మారతాయని చర్చ జరుగుతుంది.