ఆర్టీసీలో మళ్ళీ మొదలైన లొల్లి... పదవి విరమణ వయస్సును పెంచితే సమ్మె!!

తెలంగాణ ఆర్టీసిలో మరో లొల్లి మొదలైంది. సమస్యల పరిష్కారం దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. కొన్ని విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమ్మె తరువాత సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు కేసీఆర్. అందులో భాగంగానే రిటైర్ మెంట్ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ వయస్సు పెంచితే ఏ ఉద్యోగులైనా ఎగిరి గంతేస్తారు కానీ అందుకు భిన్నంగా ఉంది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి. వెంటనే పెంచిన వయసును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు కింది స్థాయి ఉద్యోగులు. ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు గ్యారేజీ సిబ్బందితో ఎక్కువ శాతం పదవి వయస్సు 60 ఏళ్లకు పెంచడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మాత్రం ముఖ్యమంత్రి ప్రకటనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మొత్తం ఆర్టీసీలో 48,000 మందికి పైగా ఉద్యోగులుంటే 30 వేలకు పైగా ఉన్న క్లాస్ మూడు నాలుగు ఉద్యోగుల విరమణ వయస్సు పెంచకుండా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ తో పాటు ఇతర కార్మిక సంఘాల నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగులంతా జాబ్ చేసినంత కాలం శారీరికంగా కష్టపడాల్సిందే.. కాలం తీరిన స్క్రాప్ కు పంపించాల్సిన బస్సులను కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇంకా నడుపుతుండటంతో క్లాస్ మూడు నాలుగు ఉద్యోగులు విరమణ వయస్సు పెంపును వ్యతిరేకిస్తున్నారు. డబుల్ డ్యూటీలు , ఓవర్ టైం డ్యూటీలు.. టార్గెట్ ఫిక్సేషన్, ఈపిబి వంటివి మోపడంతో వీరిలో చాలామంది నలభై యాభై ఏళ్లకే ఉద్యోగం చేయలేకపోతున్నాననే భావనలో ఉన్నారు. అయితే విరమణ వయస్సు పెంపును వ్యతిరేకిస్తూ క్లాస్ టూ ఉద్యోగులు కిందిస్థాయి కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశముంది. దీంతో రిటైర్ మెంట్ వయసు పెంపుపై బయటకు మాట్లాడేందకు జంకుతున్నారు ఉద్యోగులు.