కుటుంబ నియంత్రణ వద్దంటున్న దక్షిణాది నేతలు.. ఎందుకో తెలుసా?

'ఒకరూ ఇద్దరు కాదు, ముగ్గురైతే ముద్దు' ఇది ఎవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారు మాత్రమే అర్హులు అయ్యేలా  చట్టం తెస్తామంటున్నారు.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. కుటుంబ నియంత్రణ అనే మాట మరచిపోమంటున్నారు.  చంద్రబాబు అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కుటుంబ నియంత్రణను పాటించడంలో ముందున్న దక్షాణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని పదేళ్ల కిందటే అన్నారు.  ఒక్కరు లేక ఇద్దరు చాలు అన్న నినాదాన్ని పక్కన పెట్టేసి ఎక్కువ మంది పిల్లలను కనండి అన్న పిలుపూ పదేళ్ల కిందటే ఇచ్చారు.  ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా స్టాలిన్  ముందుకు వచ్చారు.  ఇద్దరూ కూడా తమతమ రాష్ట్రాలలో జనాభా పెరగాలని కోరుకుంటున్నారు.  ఇందుకు కారణం లేకపోలేదు. జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుంది. నియోజకవర్గాల విభజనలో కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటింది, జనాభా పెరుగుదల నియంత్రణకు దోహదపడిన దక్షిణాది రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజనలో గణనీయంగా నష్టపోనున్నాయి. భారీగా నియోజకవర్గాలను కోల్పోనున్నాయి. 

ఎందుకంటే.. ఉత్తరాదిలో జనాభా పెరుగుదల రేటు దక్షిణాదిలో కంటే ఎక్కువగా ఉంది.  జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల  నియోజకవర్గాల విభజనతో ఉత్తరాది రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలు పెరుగుతాయి. ఆ మేరకు దక్షిణాదిలో తగ్గిపోతాయి. అంటే దక్షిణాది వాయిస్ వీక్ అవుతుంది. ఇప్పటికే దక్షిణాది పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న భావన దక్షిణాది రాష్ట్రాలలో బలంగా వ్యక్ం అవుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి జనాభా తక్కువగా ఉన్న కారణంగా నష్టం జరుగుతుందన్న విషయంలో 2011 జనాభా లెక్కల సమయంలో బయటపడింది. 

ఉత్తరాది,దక్షిణాది ల మధ్య జనాభా పెరుగుదల రేటులో వత్యాసం ఉండటానికి కారణం  కుటుంబనియంత్రణ దక్షిణాది రాష్ట్రాలలో ఖచ్చితంగా,సమర్దవంతంగా అమలుచేయడమేనని తేలింది.  ఒకప్పుడు "ఇద్దరైతే ముద్దు..ఆపై వద్దు" ఒక్కరు లేదా ఇద్దరు చాలు అనే కుటుంబనియంత్రణ నినాదం జనంలోకి బలంగా వెళ్లింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ప్రజలు అందుకు కట్టుబడ్డారు.   తమ ఆర్ధిక పరిస్థితి మేరకు చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అని భావించి కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటించారు.  . పిల్లల చదువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే దక్షిణాది కుటుంబాలు ఒకరిద్దరు పిల్లలో సరి పెట్టుకుని పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకాలూ, ఆర్థిక సమస్యలూ ఎదురు కాకుండా చూసుకున్నారు. 

ఎందుకంటే ప్రైవేటీకరణతో విద్య, వైద్యం చాలా ఖరీదుగా మారిపోయాయి.  పిల్లల ఎల్కేజీ చదువుకే లక్షలు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి, చిన్నపాటి జ్వరానికే వేలాది రూపాయల చమురు వదిలే పరిస్థితి వచ్చింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు చిన్న కుటుంబాలే మేలని తలపోసి కుటుంబనియంత్రణ వైపే మొగ్గు చూపాయి. అయితే ఉత్తరాదిలో ప్రజలు మాత్రం అందుకు భిన్నంగా కుటుంబ నియంత్రణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో జనాభా పెరుగుదల విషయంలో దక్షిణాది ఉత్తరాది మధ్య భారీ అంతరం ఏర్పడింది. 

సాధారణంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా జనాభా నియంత్రణకు దోహదపడిన దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేలా చర్యలు ఉంటాయి. కానీ జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాదికి అన్యాయం జరిగేలా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది. అదే మాదిరిగా కేంద్రం నిధుల కేటాయింపులు ఉంటున్నాయి. అంటే ఎక్కువ జనాభా ఉంది కనుక ఎక్కువ నియోజకవర్గాలు ఉత్తరాదికి. జనాభా ఎక్కువగా ఉండటం వల్ల పేదరికం ఎక్కువగా ఉంది.. అందుకు కేటాయింపులలో అధిక భాగం ఉత్తరాదికే అన్నట్లుగా పరిస్థితి ఉంది. 

అంటే జనాభానియంత్రణకు దోహదపడిన కారణంగా దక్షిణాదికి తీరని నిష్టం జరుగుతోంది. అందుకే  దక్షిణాది నేతలు కుటుంబ నియంత్రణ వద్దంటున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అర్హత అంటున్నారు. పౌరుని సగటు కుటుంబ ఆదాయం 5వేల నుంచి11వేలరూపాయలకు పెరిగింది.అలాగే సగటు వ్యయం 5వేల నుంచి 12వేల రూపాయలకు పెరిగింది.తెలుగురాష్ట్రాలలో అత్యధిక కుటుంబాలు గ్రామాల్లో నివసిస్తున్నారు.

అలాగే మరో కారణమేంటంటే ప్రస్తుతం దేశంలో యువత జనాభా ఎక్కువగా ఉంది. అయితే ఈ పరిస్థితి రానున్న 30ఏళ్లలో  పూర్తిగా మారిపోతుంది. మూడు దశాబ్దాల తరువాత దేశంలో వృద్ధుల జనాభా అధికమౌతుంది.  అందుకని ఇప్పుడు జనాభా రేటు పెరాగాల్సిఉంది.అప్పుడే మన దేశం రాబోయే 30ఏళ్లలో కూడా యువత అధికంగా ఉన్న దేశంగా నిలువగలుగుతుంది. యువత అధికంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో పరుగులెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఉభయతారకంగా ఉంటుందని చంద్రబాబు, స్టాలిన్ వంటి నేతలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి, దేశ పురోభివృద్ధిలో బాగస్వాములు కండి అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు.