గ్రేడ్-1 ర్యాంక్‌... కానీ అక్కడన్నీ ...లో-క్లాసే

సంగారెడ్డి... గ్రేడ్-1 ర్యాంక్‌ మున్సిపాలిటీ... అంతేకాదు, ఏళ్ల తరబడి జిల్లా కేంద్రంగా కొనసాగుతోంది... 1954లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన సంగారెడ్డిలో ప్రస్తుతం లక్ష పైచిలుకు జనాభా, 70వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. సంగారెడ్డిలో 38 వార్డులుండగా... ఇంటి-ఆస్తి పన్నులే ప్రధాన ఆదాయ వనరులు. అయితే, సంగారెడ్డి మున్సిపాలిటీ ఏర్పడి 60ఏళ్లు దాటుతున్నా... జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నా... అభివృద్ధి మాత్రం ఆశించినస్థాయిలో జరగలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సంగారెడ్డి తలరాత మాత్రం మారడం లేదు. ఇప్పటికీ సరైన రోడ్లు లేవు... పారిశుద్ధ్య నిర్వహణా లేదు. ఇక, డ్రైనేజీ వ్యవస్థ అయితే అధ్వాన్నంగా తయారైంది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. మరోవైపు, తాగునీటికి కూడా జనం కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక, పేరుకు గ్రేడ్-1 మున్సిపాలిటీ అయినా సంగారెడ్డిలో కనీస మౌలిక వసతులు కూడా కరువయ్యాయి.

అయితే, సంగారెడ్డిని తాము అభివృద్ధి చేశామంటే... తాము డెవలప్ చేశామని... టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు వాదులాడుకుంటున్నారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగిందని టీఆర్ఎస్‌ నేతలు అంటున్నారు. రోడ్ల విస్తరణతోపాటు ఫ్లైడ్ లైట్స్ ఏర్పాటు చేశామని, అలాగే... రాజీవ్ పార్క్‌ను సుందరీకరించామని చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధే తప్పా.... సంగారెడ్డిలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని హస్తం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

ఏళ్ల తరబడి జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నా సంగారెడ్డి తలరాత మాత్రం మారడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లా యంత్రాంగమంతా సంగారెడ్డిలోనే కొలువుదీరినా అభివృద్ధికి నోచుకోవడం లేదని మండిపడుతున్నారు. పేరు గొప్ప... ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైందని అంటున్నారు. మరి, త్వరలో జరగనున్న ఎన్నికల్లో సంగారెడ్డి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో ఉత్కంఠ రేపుతోంది.