ఒకటీ రెండూ కాదు.. ఐదు గిన్నిస్ రికార్డులు.. డ్రోన్ షో గ్రాండ్ సక్సెస్!

జగన్ ఐదేళ్ల అరాచక పాలన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అధోగతికి తీసుకు వెళ్లింది. ఆయన ఏలుబడిలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. అంతటా దోపిడీ, దౌర్జన్యం రాజ్యమేలాయి. పారిశ్రామిక రంగం కుదేలైంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం పడకేసింది. రాజధాని అమరావతి శిథిలావస్థకు చేరింది. అసలు అమరావతి రాజధానే కాదు.. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయంటూ జగన్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. ఆయన కేబినెట్ లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే అమరావతిని శ్మశానంతో పోల్చారు. రాష్ట్ర రాజధానికి భూములిచ్చిన  రైతులు నానా ఇబ్బందులూ పడ్డారు. రాజధాని కోసం ఎలుగెత్తిన పాపానికి కేసుల్లో ఇరుక్కున్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు, జైలు పాలయ్యారు. అవమానాలు ఎదుర్కొన్నారు. ఐదేళ్ల పాటు రోడ్డెక్కి అలుపెరుగని, విరామంలేని పోరాటం చేశారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.  అమరావతి ఫీనిక్స్ పక్షిలా ఎగసింది. శిథిల స్థితి నుంచి పునరుజ్జీవం పొందింది. అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయి. మూడేళ్ల కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశిస్తే, మునిసిపల్ మంత్రి పొంగూరు నారాయణ మూడేళ్లలో అమరావతి పూర్తి అవుతుందని ప్రకటించారు. అటువంటి అమరావతి నగరం ఇప్పుడు ఆధునిక సాంకేతికకు విశ్వనగరంగా మారుతోంది. ఆ అడుగులు మంగళవారం (అక్టోబర్ 22) నుంచి ప్రారంభమైన డ్రోన్ సమ్మిట్ ద్వారా ఘనంగా పడ్డాయి. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌, ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌ను కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, రాష్ట్ర మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డుల శాఖ మంత్రివ‌ర్యులు బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి త‌దిత‌రుల‌తో క‌లిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 

భవిష్యత్ ను ముందే చూడటం.. అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టడం చంద్రబాబు విధానం. ఆయన దార్శనికత తెలుగుయువతకు ఐటీ రంగంలో అపార అవకాశాలను సృష్టించింది. ఔను 1995లో ఆయన ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు. యువతకు అపార ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఐటీ సృష్టిస్తుందంటే కంప్యూటర్లు కూడు పెడతాయా, ఫోన్లు బతుకుతెరువు చూపుతాయా అని ఎగతాళి చేశారు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన హైదరాబాద్ ను ఐటీలో అగ్రగామిగా నిలబెట్టారు. ఏకంగా హైటెక్ సిటీ సైబరాబాద్ నగరాన్నే నిర్మించారు. ఇప్పుడు ప్రంపచ స్థాయి ఐటీ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా ఉంది. అంతేనే లక్షల మంది తెలుగు యువకులు ఐటీ రంగంలో నిపుణులు, నిష్ణాతులుగా మారి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. 

ఇప్పుడు భవిష్యత్ డ్రోన్స్ దే.  ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తనప్పుడు వరద బాధితులకు ఎలాంటి వృధా లేకుండా నాణ్యమైన ఆహారాన్ని సకాలంలో అందించడానికి డ్రోన్లను వినియోగించిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు ఆహారం అందించడానికి దేశంలోనే తొలి సారిగా డ్రెన్లను వినియోగించారు. ఆ దార్శనికత, ఆ సమయస్ఫూర్తి చంద్రబాబుదే. ఇక వరద తగ్గుముఖం పట్టిన తరువాత బురద, చెత్త తొలగించేందుకు కూడా డ్రోన్లను వినియోగించారు. డ్రోన్ల ద్వారా ఏయే ప్రాంతాలలో చెత్త పేరుకుపోయి ఉందో స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన దానిని తొలగించారు. ఏ రకంగా చూసుకున్నా డ్రోన్లు భవిష్యత్ లో గేమ్ ఛేంజర్లే. వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిలో కూడా భవిష్యత్ లో డ్రోన్ల వినియోగం పెరుగుతుంది.   

ఆ భవిష్యత్ ను ఇప్పుడే దర్శించేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి డ్రోన్ సమ్మిట్ ద్వారా దాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ డ్రోన్ సమ్మిట్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను సాధించింది. ఒకే రోజు ఒకే కార్యక్రమం  ఏకంగా ఐదు వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుందంటే అది మామూలు విషయం కాదు. ఇక మంగళవారం (అక్టోబర్ 22) రాత్రి విజయవాడ పున్నమిఘాట్ వద్ద జరిగిన డ్రోన్ షో నిజంగా ఒక విజువల్ వండర్. ఒకే సారి 5500 డ్రోన్లు ఆకాసంలోకి చేసిన విన్యాసాలు ఒక అద్భుతం.    
ఇక ఈ డ్రోన్ షో  లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ , నదీతీరంలొ లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టిలార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్   డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శనఏరియల్ లోగో లతో ఐదు రికార్డులను అమరావతి డ్రోన్ షో సృష్టించింది. ఇక ఈ డ్రోన్ సమ్మిట్ వేదికగా చంద్రబాబు తనను తాను డ్రోన్ ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకున్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో 300 ఎకరాలు కేటాయించనున్నట్లు చెప్పారు.

అక్కడ డ్రోన్ హబ్ ఏర్పటు చేయనున్నట్లు ప్రకటించారు. డ్రోన్ మాన్యుఫాక్చరింగ్ కు కేంద్రం సహాయాన్ని కోరారు.  పాతికేళ్ల కిందట ప్రతి కుటుంబంలోనూ ఒక ఐటీ  వ్యక్తి ఉండాలని ఆకాంక్షించాననీ, ఆ ఆకాంక్ష నెరవేరిందనీ, ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఒక వ్యాపారవేత్త, స్టార్టప్ కంపెనీ ఉండాలన్నది తన ఆకాంక్షగా చంద్రబాబు చెప్పారు.  టెక్నాల‌జీ, గ్లోబ‌ల్ స‌ర్వీసెస్‌లో  భారత్ నంబర్ వన్ గా నిలపాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తం మీద అమరావతి డ్రోన్ సమ్మిట్ ద్వారా ప్రపంచం దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లేలా చేయడంలో చంద్రబాబు వంద శాతం సక్సెస్ అయ్యారు.