భారత వాయుసేన గగన గర్జన.. యుద్ధమైనా, విపత్తయినా హీరోలా ఎంట్రీ..

శత్రు మూకలతో యుద్ధమైనా, ప్రకృతి విపత్తులతో పోరాటమైనా.. సాయం అడగకుండానే గగనం నుంచి ఆపన్నహస్తాన్ని చాచే మన హీరో ఎవరంటే ‘భారతీయ వాయుసేన’ (Indian Airforce). కేవలం ఆరుగురు అధికారులు, 19 మంది సిపాయిలతో ప్రస్థానం ప్రారంభించి నేడు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద వాయుసేనగా భారతదేశానికి భరోసా, శత్రుదేశాలకు దడ పుట్టించగల సత్తావున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేడు 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రతి ఏడాది అక్టోబర్ 8న నిర్వహించే ఈ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే విశిష్టత, చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుందాం.

ఎయిర్‌ఫోర్స్ డే జరుపుకోవడానికి కారణం ఏంటి..

భారత వైమానిక దళాన్ని స్థాపించిన తేదీ 8 అక్టోబర్ 1932ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే నిర్వహిస్తారు. నిజానికి భారత వైమానిక దళాన్ని బ్రిటీష్ పాలనాకాలం 1932లోనే స్థాపించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు సహాయక దళంగా భారత వాయుసేనను ఏర్పాటుచేశారు. మొదటి కార్యచరణ స్క్వాడ్రన్ ఏప్రిల్ 1933లో రూపుదిద్దుకుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ పేరుకు ముందు రాయల్ అనే ట్యాగ్‌ను జోడించారు. అప్పటి నుంచి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గా పిలిచేవారు. అయితే 1950లో భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత తిరిగి ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ పేరును స్వీకరించారు. 1933లో కేవలం ఆరుగురు అధికారులు, 19 మంది హవాయ్ సిపాయిలతో ఏర్పాటైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ క్రమక్రమంగా తన శక్తిసామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ నేడు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద క్రియాశీల వైమానిక దళంగా రూపుదిద్దుకుంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  అనేక సేవలు అందించింది. అనేక యుద్ధాలలో పాలుపంచుకుంది. పాకిస్తాన్‌తో నాలుగు యుద్ధాలు, చైనాతో జరిగిన ఒక యుద్ధం ఎంతో ముఖ్యమైనవి. ఒక్క యుద్ధాలే కాకుండా భారత భూభాగానికి అన్ని వేళలా పహారాకాయడం, గగనతలాన్ని సదా సంరక్షించడం, దేశ ప్రయోజనాలను కాపాడటంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో దేశానికి విశిష్టమైన సేవలు అందిస్తోంది. నిరంతరాయంగా నిస్వార్థ సేవలను దేశానికి అందిస్తోంది. వాయుసేన సేవలను గౌరవిస్తూ ప్రతి ఏడాది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే ఘనంగా నిర్వహిస్తుంటారు. ఎంతో ముఖ్యమైన ఈ రోజున వైమానిక దళ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రత్యేక వైమానిక ప్రదర్శనలు నిర్వహిస్తారు.

మరింత దృఢంగా, పటిష్టంగా..

భారత సాయుధ దళాలలో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి యుద్ధ, విపత్కర పరిస్థితులనైనా అలవోకగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా పటిష్టతపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా వాయుసేనలో అధునాతన టెక్నాలజీతో కూడిన విమానాలను ప్రవేశపెడుతోంది. విమానాల తయారీలో దేశీయ టెక్నాలజీ వినియోగించడంతోపాటు కొత్త సాంకేతికతతో కూడిన విమానాలను పలు దేశాల నుంచి సేకరిస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోంది. మరోవైపు నియామకాలపై కూడా శ్రద్ధ పెట్టింది. ముఖ్యంగా వాయుసేన మహిళలకు కూడా విశిష్ట ప్రాధాన్యతను కల్పిస్తుండడం మనమంతా గర్వించదగిన అంశం. మొత్తంగా..  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దినోత్సవాన మన వాయుసేన మరింత పటిష్టంగా,  శత్రువులకు వణుకు పుట్టించేలా రూపాంతరం చెందాలని ఆకాంక్షిస్తూ ఎయిర్‌ఫోర్స్ హీరోలకు ఒక సెల్యూట్ చేద్దాం..


                                          *నిశ్శబ్ద.

Related Segment News