సమాచార వ్యవస్థలో బహుదూరపు బాటసారి.. పోస్టల్ సేవలు!
posted on Oct 9, 2023 11:18AM
సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఇప్పుడంటే రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్‌ని క్షణాల్లో సులువుగా గమ్యస్థానానికి చేరవేయగల వ్యవస్థలు ఎన్నో రూపుదిద్దుకున్నాయి. సామాన్యులు సైతం స్మార్ట్‌ఫోన్లు, టెలిఫోన్లు, వందల సంఖ్యలో యాప్స్ ఇలా ఎన్నో సాధనాలు సమాచార వ్యవస్థ రూపురేఖల్నే మార్చేశాయి. కానీ ఇవేమీ లేని పూర్వ ప్రపంచానికి కొన్ని తరాలపాటు లేఖల ద్వారా విశిష్ట సేవలు అందించిన ఏకైక సాధనమే ‘పోస్టల్ వ్యవస్థ’. కుటుంబ సభ్యులు, ప్రియుమైన వ్యక్తులు, ప్రభుత్వప్రైవేటు వ్యవస్థల నుంచి శుభవార్తలైనా, చేదు సమాచారమైనా ఇంటి వద్దకే ఉత్తరాలు మోసుకొచ్చిన ఘనమైన చరిత్ర కలిగిన పోస్టల్ వ్యవస్థ దినోత్సవం నేడు. ‘వరల్డ్ పోస్టల్ డే’ అని కూడా అంటారు. గ్లోబల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు నాంది పలికిన పోస్టల్ వ్యవస్థ గొప్పదనం, ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు?. ఇందుకు కారణాలు ఏంటి? అంత ప్రాధాన్యత ఎందుకు? వంటి విశేషాలను తెలుసుకుందాం..
పోస్టల్ డే ఎందుకు?.. 1874లో ఏం జరిగింది?
ప్రపంచదేశాల మధ్య కమ్యూనికేషన్ కోసం స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ వేదికగా 1874 అక్టోబర్ 9న యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) ఏర్పాటైంది. UPU ప్రపంచంలోనే రెండవ పురాతన అంతర్జాతీయ సంస్థ కావడం విశేషం. ఇది ఏర్పాటైన తర్వాత ప్రపంచ దేశాల మధ్య పోస్టల్ రంగంలో విశిష్టమైన సహకారం పెరిగింది. ఆధునిక వస్తు,సేవలకు యూపీయూ ఏర్పాటు బాటలు వేసింది. ప్రపంచవ్యాప్తంగా లేఖలు, సమాచార మార్పడి వృద్ధి చెందింది. గ్లోబల్ కమ్యూనికేషన్స్ విప్లవానికి నాంది పలికిన యూపీయూ ఏర్పాటైన అక్టోబర్ 9ని ప్రపంచ తపాలా దినోత్సవంగా 1969లో జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన యూపీయూ కాంగ్రెస్ నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు ప్రతి ఏడాది వేడుకల్లో పాల్గొంటాయి.
ప్రాముఖ్యత ఏంటి?
పోస్టల్ రంగంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంతోపాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తపాలా రంగం అందిస్తున్న భాగస్వామ్యాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తుచేయడమే లక్ష్యంగా ప్రతి ఏడాది అక్టోబర్ 9న అంతర్జాతీయ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ గతిలో పోస్టల్ వ్యవస్థ పాత్రను చాటి చెప్పేలా వేడుకలు నిర్వహిస్తారు. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యువకుల కోసం అంతర్జాతీయ లెటర్ రైటింగ్ పోటీ నిర్వహిస్తుంటుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక థీమ్‌తో వరల్డ్ పోస్టల్ డే వేడుకలకు నిర్వహిస్తోంది.
‘‘ విశ్వాసం కోసం ఉమ్మడిగా: సురక్షితమైన, అనుసంధాన భవిష్యత్తు కోసం సహకారం’’ అనే థీమ్‌తో ఈ ఏడాది పోస్టల్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఐరాస ప్రకటించింది. కాగా గతేడాది ‘ప్లానెట్ కోసం పోస్ట్’అనే థీమ్‌తో వేడుకలు నిర్వహించారు. తపాలా దినోత్సవాన్ని అనేక మార్గాల్లో నిర్వహించవచ్చు. అనేక దేశాలు తపాలా కార్యాలయాల వద్ద ప్రత్యేక స్టాంపు సేకరణ, ప్రదర్శనలను చేపట్టనున్నాయి. పోస్టల్ చరిత్రపై వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నాయి. ఇక వ్యక్తిగతం కూడా ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహించవచ్చు. ప్రియమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులకు లేఖలు రాసి పంపవచ్చు.. ఇలా చేస్తే సాంప్రదాయ పోస్టల్ వ్యవస్థ మీద అభిమానాన్ని చాటినట్టవుతుంది. అంతే కాదు.. ఏన్ని మాటలు ఫోన్లో అయినా, ఎదురుగా అయినా మాట్లాడినా అవన్నీ కొద్దిసేపటికే మరచిపోతారు. ఎంత గుర్తుంచుకున్నా కొన్నింరోజులు మాత్రమే వి గుర్తుంటాయి. కానీ ఉత్తరాల ద్వారా సాగే సంభాషణ ఆ కాగితాల్లో ఏళ్ల తరబడి అపురూపమైన జ్ఞాపకంగా ఉండిపోతాయి. అందుకే ఉత్తరాలకు గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది. ఉత్తరాల కోసం స్థానిక పోస్టాఫీసు సందర్శించాలి. అక్కడి సిబ్బందిని అడిగి పోస్టల్ చరిత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు పోస్టల్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. తద్వారా ఉద్యోగులకు మద్దతు తెలిపినట్టవుతుంది. ఇలా చేయడం వల్ల వారిలో ఉత్సాహాన్ని నింపినట్టువుంది. ఇవీ పోస్టల్ డే విశేషాలు. మీ ప్రియమైన వారికి లేఖ రాయడం మరచిపోకండి మరి..!
*నిశ్శబ్ద.