ప్రపంచం మీద తెల్లబంగారం మెరుపులు!!
posted on Oct 7, 2023 11:38AM
ప్రపంచవ్యప్తంగా కోట్లాది మందికి జీవనోపాధి.. మానవాళి శరీరాన్ని సదా రక్షిస్తున్న దుస్తుల తయారీలో ముఖ్య ముడిపదార్థం.. ఫైబర్‌గా మాత్రమే కాకుండా ఆహారంగానూ అక్కరకొస్తున్న ఏకైక పదార్థం ఒకటుంది. అదే ‘మనం తెల్ల బంగారం’గా పిలుచుకునే పత్తి. ప్రపంచవ్యాప్తంగా అనునిత్యం అనేక విధాలుగా అందరికీ ఉపయోగపడుతూ మరింత అన్వేషణలకు మార్గం చూపుతున్న పత్తి దినోత్సవం నేడు (అక్టోబర్ 7). రోజువారి జీవితంలో విడదీయరాని ప్రాధాన్యత ఉన్న పత్తిని కేవలం ఒక ముఖ్యమైన వస్తువుగా మాత్రమే పరిమితం చేయలేం. గ్రామీణ జనాభాకు జీవనోపాధి కల్పించడంలో పత్తి ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు, ముఖ్యంగా వెనుకబడిన ప్రదేశాల్లో పత్తి ఒక ముఖ్యమైన ఆదాయ, ఆర్థిక, ఉపాధి వనరుగా విశిష్ట గుర్తింపు పొందింది. మనవాళి జీవితాల్లో అంత ప్రముఖమైన పత్తి ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి సమాజంలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సంవత్సరం ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 7న నిర్వహించే ఈ ప్రత్యేక రోజు ప్రాధాన్యతను ఏమిటో చూస్తే..
అసలు ఎలా మొదలైంది..
పత్తి దినోత్సవాన్ని నిర్వహించడం 2019లో ప్రారంభమైంది. సబ్-సహారా ఆఫ్రికాలోని బెనిన్, బుర్కినా ఫాసో, చాడ్, మాలీ అనే నలుగురు ప్రధాన పత్తిసాగుదారులు ఇందుకు తోడ్పడ్డారు. వీరు నలుగురు 2012లో ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు ప్రతిపాదన చేశారు. 2019లో బెనిన్, బుర్కినా ఫాసో,చాడ్, మాలీల ప్రతిపాదనను ప్రపంచ వాణిజ్య సంస్థ స్వీకరించి మొదటి ప్రపంచ పత్తి దినోత్సవ వేడుకలను నిర్వహించింది. తొలిసారి జరిగిన ఆ వేడుకల్లో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ కూడా ఆ వేడుకల్లో పాలుపంచుకున్నాయి. దీంతో అప్పటి నుంచి పత్తి దినోత్సవం వేడుక కొనసాగుతోంది.
పత్తి దినోత్సవం గమ్యం ఇదే..
‘మేకింగ్ కాటన్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్’ అనే థీమ్‌ను మూడవ అధికారిక పత్తి దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి స్వీకరించింది. వ్యవసాయం నుంచి ఫ్యాషన్ వరకు ఆర్థికాభివృద్ధిలో పత్తి పోషిస్తున్న పాత్రపై అవగాహన కల్పించాలని ఐరాస ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యం, పేదరిక నిర్మూలన, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, ఉత్పాదక ఉపాధిని కల్పిస్తున్న పత్తి గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఐరాస లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఐక్యరాజ్యసమితి అధికారిక వెబ్‌సైట్ చెబుతోంది. మెరుగైన ఉత్పత్తి, పౌషకాహారం, మెరుగైన పర్యావరణం, మెరుగైన జీవితం కోసం పత్తిరంగం పునరుద్ధరణను పత్తి దినోత్సవం గుర్తుచేస్తుంది. పత్తి దినోత్సవం లక్ష్యం సాకారం కావాలని సగటు పౌరులుగా అందరూ ఆశించాలి. ఇక పత్తికి సంబంధించిన రెండు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటే..
1. ఒక టన్ను పత్తి సగటున 5 మందికి ఏడాది పొడవునా ఉపాధిని అందిస్తుందని అంచనాగా ఉంది.
2. వస్త్రాలు, దుస్తులలో ఉపయోగించే ఫైబర్‌తో పాటు ఆహార ఉత్పత్తులను పత్తి నుండి సేకరించవచ్చు. పత్తి విత్తనాల నుంచి తినదగిన నూనె, పశుగ్రాసం సేకరించవచ్చు.
*నిశ్శబ్ద.