ఇదిగో... వెయ్యి కోటీశ్వరుల లిస్టు!

వెయ్యి కోట్లు సంపాదించడం మన వల్ల ఎలాగూ కాదుగానీ, దేశంలో వెయ్యి కోట్లకు మించి సంపాదించిన బడాబాబులు ఎంతమంది వున్నారో... ఏయే రాష్ట్రంలో ఎంతమంది వున్నారో తెలుసుకుని ఆనందిద్దాం. మొదటగా జమ్ము-కాశ్మీర్, లఢాక్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్-నికోబార్, లక్షద్వీప్స్, కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలని తీసి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే, ఈ ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో వెయ్యి కోట్లు సంపాదించిన లక్ష్మీపుత్రులు ఎవరూ లేరు. ఇక పంజాబ్‌లో వెయ్యి కోట్లు సంపాదించిన పెద్దమనుషులు మొత్తం 12 మంది వున్నారు. హర్యానాలో 40 మంది, ఉత్తరాఖండ్‌లో ముగ్గురు, దేశ రాజధాని ఢిల్లీలో 213 మంది, రాజస్థాన్‌లో 24 మంది, ఉత్తర్ ప్రదేశ్‌లో 36 మంది, బిహార్‌లో ఆరుగురు, గుజరాత్‌లో 129 మంది, మధ్యప్రదేశ్‌లో 14 మంది, జార్ఖండ్‌లో ముగ్గురు, పశ్చిమ బెంగాల్‌లో 70 మంది, ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు, ఒడిషాలో ఐదుగురు, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 470 మంది, గోవాలో ఇద్దరు, కర్నాటకలో 108 మంది, తెలంగాణలో 109 మంది, ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది, కేరళలో 19 మంది, తమిళనాడులో 119 మంది వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు వున్నవారు వున్నారు. ఇప్పుడు చాలామంది ఒక విషయాన్ని ఆలోచిస్తూ వుండొచ్చు.. మన తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి కోట్లకు పైగా సంపాదించిన పెద్దమనుషులు ఎవరా అని... అయితే సదరు బడాబాబులు ఎంతమంది వున్నారనే సంఖ్యలు మాత్రమే బయటకి వచ్చాయిగానీ, వాళ్ళ పేర్లు మాత్రం బయటకి రాలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరి పేరు వున్నా లేకపోయినా, ఆ ఒక వ్యక్తి పేరు మాత్రం తప్పకుండా వుంటుంది. అతనెవరో మీక్కూడా తెలుసు..! సరేగానీ, ఇదంతా చదివాక ఎవరికైనా ‘‘నేనూ వెయ్యి కోట్లు సంపాదిస్తా.. ఇలాంటి లిస్టుల్లో నాపేరు కూడా వచ్చేలా చేస్తా’’ అనే ఆవేశం కలిగిందా? అయితే ఆల్ ద బెస్ట్!