హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి ఓ హెచ్చరిక!

హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కు, బీజేపీకి గొప్ప రిలీఫ్ కలిగించాయని పలు విశ్లేషణలు వస్తున్నాయి. అయితే వాస్తవానికి ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలలోనూ బీజేపీకి చావుతప్పి కన్నులొట్టపోయిందన్న చందంగానే ఫలితాలు వచ్చాయని రాజకీయ వర్గాలలో ఓ టాక్ నడుస్తోంది. వాస్తవానికి హర్యానాలో బీజేపీకి దక్కింది ఊరటలాంటి విజయమే కానీ, హ్యాట్రిక్ సాధించేశామంటూ భుజాలు తడుముకోవలసిన పని లేదని పరిశీలకులు అంటున్నారు.

హర్యానాలో బీజేపీ గెలుపు పూర్తిగా బీజేపీ యేతర పార్టీల అనైక్యత కారణంగానే అని చెబుతున్నారు. కాంగ్రెస్ అతి విశ్వాసంతో ఆప్ తో పొత్తుకు వెళ్లకపోవడమే ఆ పార్టీ కొంప ముంచింది. అంటే కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం బీజేపీ నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. నిజానికి గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దానికి తోడు మోడీ సర్కార్  రైతాంగ వ్యతిరేక విధానాల కారణంగా రైతులూ బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఎన్నికల ప్రకటనకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించేసిన పరిస్థితి. అందుకే హర్యానాపై బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అంతర్గత సంభాషణల్లోనూ, మీడియా చిట్ చాట్ లోనూ కూడా హర్యానా బీజేపీ నేతలు ఈ సారి హర్యానాలో అధికారం చేపట్టడం కష్టమన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఆ పార్టీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలు సైతం అదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీ పరాజయాన్ని  ఖరారు చేసేశాయి. తీరా ఫలితాలు వెలువడిన తరువాత  బీజేపీ విజయం ఆ పార్టీకే ఆశ్చర్యం కలిగించిందనడంలో ఇసుమంతైనా ఆశ్చర్యం లేదు.

అందుకే జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ పరాజయాన్ని తక్కువ చేసి చూపి అక్కడ బలోపేతమయ్యామంటూ సొంత భుజాలను చరుచుకుంటోంది. హర్యానా ఎన్నికలలో పోలింగ్ సరళిని చూస్తే బీజేపీ సొంత బలంతో కాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక కారణంగానే విజయం సాధించిందన్నది తేటతెల్లమౌతోంది. ఈ ఎన్నికలలో దాదాపు రెండు శాతం ఓట్లు సాధించిన ఆప్ గేమ్ ఛేంజర్ గా నిలిచింది. విజయంపై అతి విశ్వాసంతో ఆప్ తో పొత్తుకు నో అన్న కాంగ్రెస్ ఫలితం అనుభవించింది. 

ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇక్కడ ఇండియా కూటమి విజయం   బీజేపీకి నిజంగా శరాఘాతమే. అత్యంత కీలకమైన ఈ రాష్ట్రంలో ఎలాగైనా అధికారం చేపట్టాలన్నది బీజేపీ ధ్యేయం. అందుక గతంలోనే ఎన్నో విన్యాసాలు చేసింది. సైద్ధాంతిక సారూప్యత అన్నది ఇసుమంతైనా లేని పీడీపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలో భాగస్వామి అయ్యింది. ఆ పొత్తు విచ్ఛిన్నమైన తరువాత రాష్ట్రంలో ఎన్నికలకు జరగలేదు. రాష్ట్రపతి పాలనే కొనసాగింది. అంటే దాదాపుగా జమ్మూ కాశ్మీర్ కేంద్రంలోని మోడీ సర్కారే గుప్పెట్లో పెట్టుకుంది. ఆ తరువాత ఆర్డికల్ 370ని రద్దు చేసి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు శతథా ప్రయత్నించింది. ఇంత కాలం దూరం పెట్టిన రామ్ మాధవ్ ను మళ్లీ తీసుకువచ్చి రాష్ట్ర ఇన్ చార్జిగా నియమించింది. తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసైనా గెలవాలని భావించింది. అయితే బీజేపీని జమ్మూ కాశ్మీర్ జనం నమ్మలేదు. కాంగ్రెస్ నేతృత్వంతోని ఇండియా కూటమికే పట్టం కట్టారు.  దీంతో పైకి గంభీరంగా హర్యానా విజయాన్ని మోడీ సర్కార్ పట్ల ప్రజలలో ఉన్న ఆదరణకు నిదర్శనంగా చెప్పుకుంటున్నా,   జమ్మూకాశ్మీర్ ఓటమి బీజేపీకి శరాఘాతంగానే చెప్పుకోవాలి.