క్రెడిట్ కొట్టేయడానికి వైసీపీ తంటాలు!

ఉట్టికెగరలేను కానీ ఆకాశానికి నిచ్చెన వేసేశానన్నట్లుంది వైసీపీ తీరు. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు సరికదా.. అప్పటికే ఉన్న పరిశ్రమలను తరిమేసింది. జగన్ హయాంలో ఏపీలో పెట్టుబడులు అన్న మాట ఎత్తడానికే పారిశ్రామిక వేత్తలు భయపడ్డారు. అభివృద్ధి అన్న మాటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీలో ఎక్కడా వినిపించలేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి జగన్ సాధించిందేమిటయ్యా అంటే ఎవరైనా సరే జీరో అనే చెబుతారు. అటువంటి జగన్ ఆయన పార్టీ నేతలూ ఐదేళ్ల తమ పాలనలో లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగాలిచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరించామని గొప్పలు చెప్పుకుని తమ భుజాలను తామే చరిచేసుకుని సంబరపడిపోతారు.   

అదే సమయంలో అపార ఉపాధి అవకాశాలు కల్పించే సామర్ధ్యం ఉన్న అదానీ డేటా సెంటర్, ఫ్రాక్లిన్ టెంప్లెటాన్, లులు వంటి సంస్థలు జగన్ అధ్వాన విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలిపోయిన విషయంపై మాత్రం నోరెత్తరు.  2014 నుంచి 2019 వరకూ ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కొరియాకు చెందిన ఆటోమెబైల్ దిగ్గజ కంపెనీ కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో భారీ పెట్టుబడితో తన కార్ల తయారీ కంపెనీని స్థాపించింది. అప్పట్లో కియాదే దేశంలోకెల్లా అత్యంత భారీ విదేశీ పెట్టుబడి. జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లో   కియా జగన్ అస్తవ్యస్థ విధానాలకు విసిగి ఏపీనుంచి తరలిపోవాలని నిర్ణయించుకుందన్న వార్తలు వినిపించాయి. ఒక వైసీపీ ఎంపీ అయితే బహిరంగంగా కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ ను బెదిరించడం కనిపించింది. అయితే కియా విషయంలో  ప్రజల నుంచి వైసీపీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వైసీపీ వెనకడుగు వేసింది. దీంతో కియా రాష్ట్రంలో కొనసాగింది. అయితే కియా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కారణం చంద్రబాబు కాదనీ, ఆ క్రెడిట్ మొత్తం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదనీ వైసీపీ క్లెయిమ్ చేసుకుంది. ఎప్పుడో వైఎస్ రాజశేఖరరెడ్డి రాసిన లేఖ కారణంగానే కియా ఏపీలో పెట్టుబడులు పెట్టిందని జగన్ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన బుగ్గన రాజేంధ్రనాథ్ క్రెడిట్ మొత్తం జగన్ కు కట్టబెట్టేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఏపీలో టీసీఎస్ ఇన్వెస్ట్ మెంట్ల విషయంలో కూడా వైసీపీ అదే పంథా అనుసరిస్తున్నది. 

టీసీఎస్ విశాఖలో బ్రాంచి ఏర్పాటు చేయనున్నదనీ, దీని ద్వారా ప్రత్యక్షంగా పది వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయనీ నారా లోకేష్ ప్రకటించారు. అలాగే కూటమి ప్రభుత్వం విశాఖ నగరాన్ని ఐటీ హబ్ గా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలుగుదేశం కూటమి అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రానికి వస్తున్న మేజర్ ఇన్వెస్ట్ మెంట్ ఇదే అని చెప్పుకోవాలి. టీసీఎస్ బ్రాంచ్ పై లోకేష్ ప్రకటన వెలువడిన వెంటనే విశాఖలో టీసీఎస్ బ్రాంచ్ ఏర్పాటుకు ముందుకు రావడం వెనుక ఉన్నది తమ ప్రభుత్వ కృషే అని చెప్పుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. ఇందు కోసం కొన్ని పేపర్ కట్టింగులు, వైబ్ సైట్ లింకులను సొంత సామాజిక మాధ్యమంలో సర్క్యులేట్ చేయడం ప్రారంభించింది. వాటి సారాంశం జగన్ సర్కార్ ఎప్పుడో 2020లోనే టీసీఎస్ ను విశాఖకు తీసుకువచ్చిందనీ, ఆ ఘనత అంతా తమదే అని స్వోత్కర్షే. 

వాస్తవంగా ఒక ఐటీ కంపెనీ కొత్త ప్రదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయిస్తే పెద్దగా సమయం తీసుకోదు. కేవలం ఏడాది రెండేళ్లలో తన కార్యకలాపాలను ఆ ప్రదేశంలో మొదలు పెట్టేస్తుంది. కానీ జగన్ సర్కార్ హయాంలో  టీసీఎస్ విశాఖలో తన బ్రాంచ్ ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అలాగే అప్పట్లో జగన్ సర్కార్ టీసీఎస్ కు ఇస్తున్న ఇన్సెంటివ్ ల గురించి కానీ, కేటాయిస్తున్న భూమి గురించి కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే  టీసీఎస్ విశాఖలో బ్రాంచిని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనా వెలువడింది. అయితే ఎటువంటి కష్టం, శ్రమా లేకుండానే టీసీఎస్ ను విశాఖకు తీసుకువచ్చిన ఘనతను తన ఖాతాలో వేసేసుకోవడానికి వైసీపీ రెడీ అయిపోయింది.