ఆమ్రపాలికి షాక్... ఆంధ్రాకి వెళ్ళాల్సిందే!

ఐఏఎస్ ఆఫీసర్‌గా తెలంగాణ కేడర్లోనే కొనసాగాలని తీవ్రంగా ప్రయత్నించిన ఆమ్రపాలి కాటాకి బిగ్ షాక్ తగిలింది. ఆమె తక్షణం ఆంధ్రా కేడర్‌కి వెళ్ళాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్‌ కమిషనర్ పోస్టుతోపాటు పలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి 2010 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆమె తనను తెలంగాణ క్యాడర్‌లోనే కొనసాగించాలని దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ జిల్లా కలెక్టర్‌గా కొనసాగిన ఆమ్రపాలి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేశారు. మళ్ళీ తెలంగాణ కేడర్‌కి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు ప్రాధాన్యం ఇస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్‌ బాధ్యతలతోపాటు పలు కీలక బాధ్యతలు అప్పగించింది. అయినప్పటికీ తనను తెలంగాణ స్థానికత ఉన్న అధికారిగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తిని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఐఏఎస్‌ల కేడర్ల విషయంలో ఖండేకర్ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కే చెందుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దాంతో ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌ని విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆమ్రపాలి భర్త ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ. ఆయన అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, యూనియన్ టెరటరీ కేడర్లో వున్నారు. ప్రస్తుతం ఆయన లక్ష్మద్వీప్స్.లో వున్నారు.