మోడీ విదేశీ విధానం సత్ఫలితాలు ఇస్తున్నట్లే ఉంది
posted on Feb 2, 2015 12:39PM
.jpg)
ఇంతకు ముందు శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న మహేంద్ర రాజపక్స చిరకాలంగా ఆ దేశానికి పెద్ద సమస్యగా తయారయిన యల్.టి.టి. ఉగ్రవాదుల సమస్యను పరిష్కరించారు. కానీ ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రయత్నంలో నిర్వహించిన మిలటరీ ఆపరేషన్ లో వేలాదిమంది అమాయకులయిన తమిళ మహిళలు, వృద్ధులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండే తమిళనాడులో ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా రాజపక్సేని తీవ్రంగా వ్యతిరేకించేవి. ఆయన ప్రతీ ఏడాది విధిగా తిరుపతి వెంకన్న దర్శనానికి వస్తుండటం, ఆయన వచ్చినప్పుడు తమిళ పార్టీలు నిరసనలు తెలపడం ఆనవాయితీగా మారిపోయింది.
ఆయన తమిళ ప్రజలకే కాక భారతః ప్రభుత్వానికీ పెను సవాలుగా మారారు. భారత్-శ్రీలంక మధ్య సముద్రజలాలలో చేపలు పట్టుకొనే తమిళ జాలారులని తరచూ అరెస్ట్ చేసి జైల్లో పడేస్తుండటం, దానిపై తమిళ పార్టీలు నిరసనలు తెలపడం, ఆనక భారత్, శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి విడిపించుకోవడం కూడా ఆనవాయితీగా మారిపోయింది. ఇక వీటన్నిటి కంటే మరింత తీవ్రమయిన విషయం ఏమిటంటే రాజపక్సే చైనాకు దగ్గరవుతూ దానిని మంచి చేసుకొనే ప్రయత్నాలలో భారత్ అభ్యంతరాలను త్రోసిపుచ్చి చైనాకు చెందిన రెండు అణుజలాంతర్గాములను శ్రీలంక పోర్టులో నిలిపి ఉంచేందుకు అనుమతించారు.
కానీ ఇప్పుడు మైత్రీపాల నేతృత్వంలో భారత్-శ్రీలంకల మధ్య మళ్ళీ మైత్రీ బంధాలు పునరుద్దరించబడినట్లయితే, బహుశః చైనా తన రెండు అణుజలాంతర్గాములను వెనక్కి తీసుకోవలసిందిగా ఆ దేశాన్ని శ్రీలంక కోరవచ్చును. కనుక ఈ పరిణామాలు చైనాకు చాలా ఆగ్రహం కలిగించవచ్చును. కానీ భారత్ చైనాతో సహా అన్ని దేశాలతో మిత్రత్వమే తప్ప శత్రుత్వం కోరుకోదనే విషయం చైనాకు కూడా తెలుసు. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భారత్ పర్యటన ముగిసిన వెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చైనా పర్యటనకు బయలుదేరడమే అందుకు ఒక ప్రత్యక్ష ఉదారణ.
త్వరలోనే ప్రధాని మోడీ కూడా చైనా పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఆయన పర్యటనలో భారత్-చైనా దేశాల మధ్య చిరకాలంగా ఉన్న సరిహద్దు వివాదాలను శాశ్విత ప్రాతిపాదికన పరిష్కారం చేయాలని భావిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ప్రస్తుతం సుష్మా స్వరాజ్ చైనాలో పర్యటిస్తున్నారు.అంతకంటే ముందుగా ఆయన శ్రీలంకలో పర్యటిస్తారు. ఆ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడే విధంగా అడుగులు వేయవచ్చును. ఈ విధంగా ఒకే సమయంలో అటు అమెరికాతో, దానిని వ్యతిరేకించే చైనాతో, చైనా వ్యతిరేకించే జపాన్ దేశంతో, చైనాకు దగ్గరయిన శ్రీలంకతో సత్సబందాలు నెలకొల్పుకొనే ప్రయత్నాలు చేయడం హర్షణీయం.