నమ్మకం ఎందుకు ముఖ్యం?

మనిషి జీవితంలో నమ్మకమనేది ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా విషయాలు నమ్మకంతో ముడిపడి ఉంటాయి. అయితే జీవితంలో లక్ష్యాలు సాధించే క్రమంలో నమ్మకం ఎందుకు అవసరం?? అది ఎంత వరకు ముఖ్యం?? దాని పాత్ర ఏమిటి??

నమ్మకం అనేది మనమీద మనతో ప్రారంభం కావాలి. మనం చేసే పనులపై మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే కొండల్ని సైతం పిండి చేయవచ్చు. మనం చేసే పనిపై పూర్తి నమ్మకం, శ్రమ, ఆలోచన అనేవి లేకుండా విజయాల్ని సాధించలేము. ప్రతి ఒక్కరు వారు చేసే పని చిన్నదైనా, పెద్దదైనా పరిపూర్ణతకోసం తపించాలి.

ప్రతికష్టంలోనూ ఆనందం ఉంటుంది. ఉదాహరణకు నవమాసాలు మోసి ప్రసవవేదన తరువాత పుట్టిన బిడ్డను చూసి ఆ తల్లి ఎంతో ఆనందపడుతుంది. తన కష్టాన్ని బాధల్ని పూర్తిగా మరచిపోతుంది.

అదేవిధంగా ఏ పనిచెయ్యడానికైనా కష్టం తరువాత ఆనందం వస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉంటే మనం మన జీవితంలో దేనినైనా జయించవచ్చు. నమ్మకం అనేది లేకపోతే మనం ఏ పనిని ప్రారంభించలేము. విజయాల్ని సాధించలేము. చీకటి వెనకాల వెలుగు ఎలాగైతే వుంటుందో అలాగే కష్టం వెనకాల ఆనందం, ఫలితం ఉంటాయని తెలుసుకోవాలి.

మనకు ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా చేయగలం కాబట్టి మనకి ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. ఏ పని చేస్తున్నా దానిలోని కష్టాన్ని, నష్టాన్ని కాక దానివల్ల లభించే ఫలితాలను గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే కష్టం, నష్టం గురించి ఆలోచిస్తామో అప్పుడే మనసు నిరాశలోకి జారుకుంటుంది. అదే మనిషిని లక్ష్యం నుండి వెనక్కి లాగుతుంది. కానీ అవేవి పట్టించుకోకుండా నమ్మకంతో పనిచేస్తే రాబోయే ఫలితం యొక్క ఆనందం కష్టాన్ని మరిపిస్తుంది. నేటికష్టం రేపటి ఆనందానికి పెట్టుబడి. అవుతుంది. సాధించగలమనే నమ్మకం ఉన్నప్పుడే ఆనందంగా కష్టపడగలం. సరైన ఆలోచనా విధానం కలిగి ఉండటం ప్రధానం మరి!!

"ఏ లక్ష్యం లేకుండా తింటూ జీవించడం కంటే
ఏదో ఒక లక్ష్యం కోసం చనిపోయినా ఫర్వాలేదు"
అన్నారు ప్రముఖ కార్ల కంపెనీ తయారుదారు హెన్రీఫోర్ట్. 

మనిషి తలచుకుంటే ఏ పని అయినా చెయ్యగలడు. అదేవిధంగా ఒక పనిని చెయ్యలేము అనుకుంటే ఆ పనిని ఎప్పటికీ చేయలేము. ఈ మాటలలో వైరుధ్యం ఏమీ లేదు. చెయ్యగలము, చెయ్య లేము రెండూ కరక్టే. ఒక లక్ష్యంతో విజయం సాధించిన వారు విజయం సాధించడానికి కారణం తాము అనుకున్న పనిని చేయగలమనే నమ్మకం, విశ్వాసం కలిగి వుండటమే! లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలం కావడానికి కారణం వారిలో విజయం సాధిస్తామనే నమ్మకం లేకపోవడమే తప్ప వారిలో సమర్ధత లేకపోవడం కాదు.చాలామంది  అంటారు మేము కష్టపడ్డాము అని, మేము ప్రయత్నం చేసాము అని. కానీ నిజానికి ప్రయత్నం చేయడంలో, కష్టపడటంలో కాదు మనం గెలవగలమో లేదో, సాధించగలమో లేదో అనే భావాన్ని మనసులో ఏ మూలనో ఉంచుకోవడం వల్ల విఫలం అవుతుంటారు.

మనమీద మనకు నమ్మకం ఉండాలి. మనని మనమే నమ్మకపోతే ఇతరులు మనల్ని ఎందుకు నమ్ముతారు? అందుకే మనని మనం పూర్తిగా పరిపూర్ణంగా నమ్మాలి.

జీవితంలో నమ్మకమనేది ఉంటే ఏదైనా సాధించగలం. మనం చేసే ప్రతిపనిలో నమ్మకమనేది ఉండాలి. నమ్మకమనేది వుంటే విజయాల్ని మనం సొంతం చేసుకోవచ్చు. నమ్మకం వెంటే విజయాలు వుంటాయి. నమ్మకం కలిగి ఉండటమే మన తొలి విజయం. ఇది నమ్మండి.

                                         ◆నిశ్శబ్ద.