చదువుకోవడం ఎందుకు ముఖ్యం?
posted on Sep 19, 2023 9:30AM
విద్య నేర్చుకో విలువ పెంచుకో అన్న మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే మనం విద్యావంతులం అయితేనే ఇతరులు మనలను గౌరవిస్తారు. విద్యను నేర్చుకోవడం వల్ల సమాజంలో మంచి స్థాయిని సంపాదించుకోవచ్చు. విద్యను బాగా నేర్చుకోవడం వల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు. విద్యను నేర్చుకోవడం వల్ల డబ్బును బాగా సంపాదించవచ్చు.
ప్రస్తుత సమాజంలో విద్య అనేది చాలా అవసరం. ఎందుకంటే మనిషి బ్రతకాలంటే డబ్బు చాలా అవసరం. డబ్బు కావాలంటే చదువు ఉండాల్సిందే! విద్యలేనివాడు వింత పశువు అంటారు. ఇది నిజం! ప్రస్తుత సమాజంలో విద్యలేని వాళ్ళని వింత పశువులకింద భావిస్తారు. వాళ్ళని విలువ లేని వాళ్ళుగా భావిస్తారు.
సమాజంలో విద్యలేనివారు గౌరవ మర్యాదలు కోల్పోతారు. అలాగే విలాసవంతంగా జీవితాన్ని గడపలేరు. తగినంత డబ్బును సంపాదించుకోలేరు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోలేరు. డబ్బు లేకపోయినా సమాజంలో జీవించవచ్చేమో కాని విద్య లేకపోతే జీవించడం అనేది కష్టం అవుతుంది. విద్యను నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు దానిని సద్వినియోగపరచు కోవాలి. మనం మన విద్యను సద్వినియోగ పరచు కోలేకపోతున్నామంటే అది నిర్లక్ష్యం అవుతుంది.
అలా చెయ్యలేకపోతే ఆ విద్యకు అర్థం, పరమార్ధం రెండూ ఉండవు. విద్యను ఎంతవరకు నేర్చుకున్నా మన్నది ముఖ్యం కాదు, అలాగే ఎన్ని డిగ్రీలు సంపాదించామన్నది ముఖ్యం కాదు దానిని ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటున్నాము అన్నది ముఖ్యం. బాగా విద్యావంతులైన వారి జీవితాలు డబ్బు, గౌరవ మర్యాదలు, సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. ఒక తోటలో పువ్వులు లేకపోతే ఆ తోట ఎంత శూన్యంగా కనిపిస్తుందో అలాగే మనిషి జీవితంలో విద్య అనేది లేనప్పుడు జీవితం కూడా అంతే శూన్యంగా కనిపిస్తుంది.
విద్యార్ధులు తమ విద్యార్ధి దశలోనే కష్టించి చదివి ఉన్నత ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి. ఆ సమయాన్ని వృధా చేసుకొంటే జీవితాంతం విచారించే పరిస్థితి రావచ్చు. మన లక్ష్యాలను ముందుగా నిర్దేశించుకోవాలి. లక్ష్యాలను బట్టి ప్రతి పనీ నెరవేర్చుకోవడానికి సులభమవుతుంది. మనం ఎంచుకున్న లక్ష్యం మన మనస్సుకు నచ్చినదై ఉండాలి. నచ్చినపని అయితే అందరూ మెచ్చేవిధంగా చేస్తాము. లక్ష్యాలను ఎదుర్కోవడంలో వచ్చే అవరోధాలను ధైర్యంగా, సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. మన మనస్సులో సాధించాలనుకునే విషయం తప్ప మరొక విషయం ఉండకూడదు. మనసా వాచా ఆ విషయమే ఆలోచించాలి.
అర్జునుడు చెట్టుమీద పక్షిని గురి చూసి కొట్టడం అనే ఒక కథ ఉంటుంది. ఆ కథలో అర్జునుడు చెట్టును, చెట్టుమీద కొమ్మను చూడడు. కేవలం పక్షిని మాత్రమే చూస్తాడు, దాన్ని మాత్రమే చూడటం వల్ల అర్జునుడికి గురి కుదురుతుంది. లక్ష్యాన్ని ఏర్పరచుకున్నవారు ఆ కథను గుర్తు చేసుకోవాలి. యువకులు లక్ష్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకు కాలేజీలో చేరాము అనే విషయం మర్చిపోకూడదు. పరీక్షలలో ఉన్నత ఫలితాలను సాధించడానికి ప్రయత్నం చేయాలి. అందరూ అంటారు అంత మార్కులు, ర్యాంకుల మాయం అని. చదువుతున్న విఆహాయలు గురించి పరీక్షలు రాసి తెచ్చుకునే మార్కుల గురించి, ర్యాంకుల గురించి ఎందుకు బాధ. ప్రతి విద్యార్ధి కాలేజికి ఎందుకు వెళుతున్నారో ప్రతి రోజూ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే కాలేజీలో వారి సమయాన్ని వ్యర్ధం చేసుకోరు. మనలోని కాంక్ష తీవ్రతే మనల్ని లక్ష్యం వైపునకు నడిపిస్తుంది. లక్ష్యాన్ని సాధించడానికి విజువలైజేష్ చేయటం మరొక మంచి పద్ధతి. కాబట్టి లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి, దాన్ని సాధించుకోవాలి.
◆నిశ్శబ్ద.