కృష్ణం వందే జగద్గురుమ్!

దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణ కొరకు యుగయుగాన తాను జన్మిస్తానని, ధర్మ సంస్థాపన కొరకు తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు చెబుతాడు. ప్రస్తుత మానవ సమాజానికి శ్రీకృష్ణుడు చెప్పిన ఎన్నో మాటలు వేదవాక్కులుగానూ, జీవితానికి గొప్ప మార్గాన్ని చూపే సూత్రాలుగానూ ఉంటాయి. ఒక్కసారి భగవద్గీత చదివిన వాడిలో ఎంతో పరివర్తన కలుగుతుంది. కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఎందుకంత గొప్ప గ్రంధమైంది?? అసలు కృష్ణుడు ఈ లోకాన్ని ఉద్ధరించడం ఎందుకు??

అసలు కృష్ణుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి?? 

చాలామంది కృష్ణుడి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఎక్కడైనా చూశారంటే మిగిలిన దేవుళ్ళకు మ్రొక్కినట్టు మ్రొక్కరు. ఏదో షోకేస్ లో బొమ్మను చూసినట్టు చూస్తూ పోతారు. ప్రజానీకానికి అందుబాటులో ఉండే తొందరగా అందరికీ చేరవేయబడే సినిమాలలో కృష్ణుడిని కేవలం స్ట్రీలోలుడిగానూ, మాయలోడిగానూ చూపించడం వల్ల ఏర్పడిపోయిన భావమేమో!! కానీ సమాజం మాత్రం దాన్నే నమ్ముతుంది. కానీ కృష్ణుడు ఈ ప్రపంచానికి, ఈ మానవలోకానికి చెప్పిన మాటలు ఏంటి?? తను చెప్పిన తత్వమేంటి??

జైలు గోడలు మధ్య పుట్టినవాడు, చిన్నతనంలోనే తల్లి చనుబాల రుచి చూడకుండానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైనవాడు, రాజ్యానికి రాజుగా రాజకుమారుడిగా పెరగాల్సినవాడు, గోకులంలో గోవుల మధ్య తిరగాడుతూ బ్రతికాడు. కృష్ణుడు సమస్తము తెలిసినవాడు అయినపుడు తన జీవితాన్ని గోకులానికి తరలించుకోవలసిన అవసరం ఏమైనా ఉందా?? కానీ కారణజన్ముడు కాబట్టి కర్తవ్యం నెరవేర్చాలి కాబట్టి వెళ్ళాడు. ఎంతో సాధారణ జీవితాన్ని గడిపాడు. మరి ఆయనను భోగవిలాసుడు అనడం తగునా?? ఉన్ననాడు, లేనినాడు ఒకటిగానే బ్రతికేవాడు ఉత్తముడు.

16,000 మందిని భార్యలుగా స్వీకరించి వారికి ముక్తి కలిగించాడే కానీ ఎవరితోనూ శారీరక సంబంధం అనేది లేదు కృష్ణుడికి. చేసిందంతా కృష్ణుడే, మహాభారత మహాయుద్ధమైన కురుక్షేత్రానికి కారణం ఆయనే అంటారు కానీ పేరుకుపోయిన చెడును నిర్మూలించే దృష్ట్యా చేపట్టిన లోకసంరక్షణ కార్యమది అనే విషయాన్ని అంగీకరించరు ఎందుకో!! గోవర్ధన పర్వతాన్ని ఎత్తినా, కాళీయుని పడగలపై నాట్యం చేసినా, మన్ను తిన్నా, వెన్న దొంగిలించినా, గోకులాన్ని పావనం చేసిన గోకుల కృష్ణుడు మధురను పునీతం చేయడానికి తరలిన తరువాత జరిగిన విషయాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. 

కృష్ణుడు ఎప్పుడూ ధర్మం పక్కనే ఉంటాడు. ధర్మాన్ని గెలిపించడానికే కృష్ణుడు ఆవిర్భవించాడు. అందుకే పాండవులకు మద్దతు ఇచ్చాడు. కానీ అందరూ అంటారు, మాయవి పాండవుల వైపే ఉంటాడు అని. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి ఉద్దండులు కౌరవుల వైపు ఉంటే కృష్ణుడు పాండవులవైపున్నాడు అంటారు. కానీ భీష్ముడు అయినా, ద్రోణుడు అయినా కట్టుబడిన నియమాలచేత కౌరవసేన వైపు నిలబడి పోరాడారు కానీ వారెప్పుడూ పాండవులకె వత్తాసు పలికారు.

ఇకపోతే శ్రీకృష్ణుని జీవితమంతా ఒక ఎత్తు అయితే భగవద్గీత బోధ మరొక ఎత్తు. అందులో ఏముంది అంటే జీవిత సారముంది. సగటు మనిషి తన జీవిత కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాలి?? ఎందుకు నెరవేర్చాలి?? అసలు మనిషి ఎలా బ్రతకాలి, యోగమంటే ఏంటి?? ధ్యానం అంటే ఏంటి?? కర్మలు అంటే ఏంటి?? కర్మలు మనిషిని ఎలా వెంటాడుతాయి?? మోక్షం ఎలా సాధ్యం?? దానికి ఆచరించవలసినదేమిటి?? ఇలా ప్రపంచంలో మనుషులందరూ తెలుసుకోవలసినదాన్ని  అర్జునుడికి చెబుతున్నట్టు చెబుతూ అందరికోసం చెప్పాడు. అది సమర్థవంతమైన గురువు లక్షణం కదా మరి!!  గురువెప్పుడూ తన శిష్యులను నిందించడు ఉదాహరణలు చూపిస్తూ పరోక్షంగా శిష్యుల మనసులోకి విషయాన్ని చొచ్చుకుపోయేలా చేస్తాడు. అందుకే కృష్ణుడిని బెస్ట్ మొటివషనల్ పర్సన్ అంటారు, ఇక భగవద్గీతను గొప్ప మానసిక విశ్లేషణా గ్రంధం అని అంటారు. 

ఒకసారి గమనిస్తే కృష్ణుడు బాధపడుతున్న సందర్భం ఎక్కడా కనిపించదు. అలాగని విరగబడి నవ్వుతున్నట్టు ఎక్కడా ఉండదు. కేవలం పెదాల మీద సన్నని చిరునవ్వు పూయిస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితులలోనూ ఆ నవ్వు చెదిరిపోకుండా ఉంటుంది. అదే స్థిరత్వం అంటే!!

కృష్ణుడు చెప్పేది అదే!! ఎలాంటి పరిస్థితిలో అయిన స్థిరత్వంగా ఉండాలని. 

                                         ◆నిశ్శబ్ద.