భారత్‌ మీదకి అమెరికా విమానాలు... పాకిస్తాన్‌ సాయంతో!

అమెరికా, పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందించడం గురించి భారత ప్రభుత్వం ఆగ్రహంతో ఉంటే ఉండవచ్చుగాక. కానీ అమెరికా మాత్రం ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే సిద్ధంగా ఉంది. గత వారం ఈ ఒప్పందానికి విరుద్ధంగా, అమెరికన్‌ సెనేట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానం దారుణంగా ఓడిపోయింది. సాక్షాత్తూ ఆ దేశ కార్యదర్శి జాన్‌ కెర్రీ ఈ తీర్మానాన్ని ముందుండి గెలిపించారు. ‘తీవ్రవాదం మీద జరుగుతున్న పోరులో పాకిస్తాన్‌ అంకితభావంతో పనిచేస్తోందంటూ’ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తన చేతికి దొరికే ప్రతి ఆయుధాన్నీ భారత్‌ వైపుకి ఎక్కుపెట్టేందుకే సిద్ధపడే పాకిస్తాన్‌కు, అమెరికా ఎందుకు సాయం చేస్తున్నట్లు!

20వ శతాబ్దం తనది అని చెప్పుకునే అమెరికాని, ఆ శతాబ్ది ఆరంభంలోనే గడగడ వణికించిన చరిత్ర తాలిబాన్‌ది. ఒకప్పుడు అమెరికా స్వయంగా పాలుపోసి పెంచిన తాలిబాన్‌, చివరికి అదే దేశం మీద కాటువేయడం ఒక చారిత్రక సత్యం. ప్రస్తుతం తాలిబాన్‌ నిస్తేజంగా ఉండి ఉండవచ్చు. కానీ నిర్వీర్యం మాత్రం కాలేదు! తాలిబాన్‌ ప్రముఖులంతా తమ దేశంలో హాయిగా ఉన్నారని, పాకిస్తాన్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ నిస్సిగ్గుగా పేర్కొన్నారు. అంతేకాదు! వారు తలదాచుకునేందుకు సాయం చేయడం వల్ల, వారి మీద కావల్సిన ఒత్తిడిని తీసుకురాగలుగుతున్నామనీ, శాంతి ఒప్పందాలలో వారిని భాగస్వామ్యులను చేయగలుగుతున్నామనీ సర్తాజ్‌ ఉవాచ!

తాలిబాన్‌ ఇప్పుడు పాకిస్తాన్‌ ఆధీనంలో ఉండటం వల్లే, అమెరికా ఆ దేశానికి లొంగుతోందన్నది ఓ విశ్లేషణ. తాలిబాన్‌ మళ్లీ బుసకొట్టకుండా ఉండేందుకు, మరీ ఎదురుతిరిగితే వారిని అణిచివేసేందుకు... అమెరికా, పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నది ప్రస్తుత విమర్శ. అంటే విషనాగులను చూపించి, వాటిని వదులుతామని బెదిరించి... పాకిస్తాన్‌ పనిజరుపుకుంటోందన్నమాట!

అమెరికాలాంటి దేశానికి పాకిస్తాన్‌తో వ్యవహరించేటప్పుడు ఉండే ప్రమాదాలు తెలియకుండా ఉండవు. కేవలం తాలిబాన్ బూచిని చూసి అమెరికా, పాకిస్తాన్ సాయం చేస్తోందని స్పష్టంగా భావించలేం. ప్రపంచంలోని ఏ ప్రాంతాంలోలైనా ఒక దేశం నిదానంగా బలపడుతుంటే... ఆ దేశంతో అకారణంగా తలపడటమో లేక సదరు ప్రాంతంలో తన ప్రాభవాన్ని పెంచుకోవడమో అమెరికా చేస్తున్న పనే! తన ఆధిపత్యానికి భంగం కలిగించే ఏ దేశాన్నీ అమెరికా ఉపేక్షించదన్నది చరిత్రకారుల అభిప్రాయం. అందుకే చైనా ప్రాభవాన్ని తగ్గించేందుకు భారతదేశాన్నీ, భారతదేశం ప్రాభవం తగ్గించేందుకు పాకిస్తాన్నీ బలపరుస్తూ ఉంటుందని ఓ ఆరోపణ. భారతదేశం, ఫ్రాన్స్‌తో రాఫెల్‌ యుద్ధవిమానాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఖరారు చేసుకోగానే, అమెరికా తన ఎఫ్‌-16 ఒప్పందాన్ని ముందుకు తీసుకురావడం గమనించాల్సిన అంశం. ఆర్థికంగానూ, ఆయుధపరంగానూ దూసుకుపోతున్న ఇండియాకు చెక్‌ పెట్టేందుకే అమెరికా ఈ పని చేస్తోందన్నది ఓ అభియోగం.

తీవ్రవాదం మీద పోరు పేరుతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలను పాకిస్తాన్‌కు సాయంగా అందించిన అమెరికా, ఇప్పుడు యుద్ధవిమానాలను అందించడం ఓ పరాకాష్ట. ఈ విమానాలను ఊరికనే అందిస్తున్నారా, ఉచితంగా ఇస్తున్నారా అన్ని విషయం మీద స్పష్టత లేనప్పటికీ.... విమానాలు పాకిస్తాన్‌ అమ్ములపొదిలో చేరడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

దాదాపు 40 సంవత్సరాలుగా అమెరికా సైన్యంలో ముఖ్య భూమికను పోషిస్తూ, మారుతున్న అవసరాలను అనుగుణంగా ఆధునికతను సంతరించుకుంటున్న ఈ ఎఫ్‌-16 విమానాలు నిజంగానే పాకిస్తాన్‌కు ఓ వరం. నేరుగా యుద్ధం చేయడంలోనూ, యుద్ధానికి వస్తున్న శత్రువులను ఎదుర్కోవడంలోనూ ఈ విమానాలకి సాటిలేదు. అలాంటి వాహకాలు ఇప్పుడు పాకిస్తాన్‌ రక్షణలో ఉంటే, వాటని ఆ దేశం దుర్వినియోగం చేస్తుందన్న భారత్‌ ఆందోళనలో నిజం లేకపోలేదు. అసలే పఠాన్‌కోట్‌ దాడులతో ఉడికిపోతున్న భారత ప్రభుత్వానికి ఈ ఒప్పందం నిజంగానే పుండు మీద కారంలా ఉంది. ఇప్పటికే మన రక్షణ శాఖా మంత్రి సహా అనేక మంది నేతలు ఈ ఒప్పందం మీద గట్టిగానే తమ నిరసనను తెలియచేస్తున్నారు. కానీ జిత్తులకు పెట్టింది పేరైనా అమెరికా మాత్రం, ఈ వ్యవహారాన్ని ముగించేదాకా ఊరుకునేట్లు లేదు. మరి ఈ విషయాన్ని భారత ప్రభుత్వం కేవలం నిరసనల వరకే పరిమితం చేస్తుందా, లేకపోతే అమెరికాకు దీటైన జవాబునిస్తుందా అన్నది వేచిచూడాలి!