జగన్ హయాంలోనే వాలంటీర్ వ్యవస్థ రద్దైపోయింది.. అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన మంత్రి డోలా!

 మనుషులను, వ్యవస్థలను వాడుకోవడంలో తనను మించిన వాడు ఎవరూ ఉండరన్న రీతిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ  నిర్వీర్యం చేసి పారేశారు. అన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకుని ఇష్టారీతిగా వాడేసుకున్నారు. అదే రీతిలో ఆయన తన కోసం తన చేత తానే సృష్టించుకున్న వలంటీర్ వ్యవస్థ కూడా ఉంది.  అటువంటి వాలంటీర్ వ్యవస్థను సృష్టించిన చేతులతోనే జగన్ తుంచేశారు.  

అందుకే ఇప్పుడు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉనికి కూడా లేకుండా పోయింది. ఆయన కోసం అన్నీ వదులుకుని నామమాత్రపు వేతనాల కోసం వాలంటీర్లుగా చేరిన లక్షలాది మంది యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది.ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా  మంత్రి డోలా బాలవీరాంజ నేయులు చెప్పారు. జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అన్నదే లేకుండా పోయిందని ఆయన కుండబద్దలు కొట్టేశారు.  గత ఏడాది ఆగస్టు నుంచే రాష్ట్రంలో  వాలంటీర్ వ్యవస్థ ఉనికి మాత్రంగా కూడా లేకుండా పోయిందని తేటతెల్లం చేశారు . 2023 ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించాల్సి ఉండగా జగన్ సర్కార్ ఆ పని చేయలేదని మంత్రి చెప్పారు. జగన్ నిర్వాకం వల్ల 2023  ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థకు నూకలు చెల్లిపోయాయన్నారు. 

వాలంటీర్లను కొనసాగిస్తామంటూ తాము ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందామన్నా నిలబెట్టుకోలేని పరిస్థితి ఉందనీ, కొలువులోనే లేని ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి వేతనం ఇవ్వడం ఎలా సాధ్యమని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు.  వాలంటీర్ల వ్యవస్థను జగన్ సర్కార్ పునరుద్ధరించి ఉన్నట్లైతే తమ సర్కార్ ఇప్పుడు దానిని తప్పని సరిగా కొనసాగించేదని డోలా  చెప్పారు.