ఆధార్‌కి చట్టబద్ధత ఎందుకంటే!

 

ఎట్టకేలకు ప్రభుత్వం తన పంతాన్ని నెరవేర్చుకుంది. Aadhaar (Targeted Delivery of Financial and Other Subsidies, Benefits and Services) బిల్లుకి ఎలాగొలా చట్టబద్ధతను కల్పించగలిగింది. రాజ్యసభలో పాలకపక్షానికి తగిన బలం లేకపోవడంతో ఈ బిల్లుని ‘ద్రవ్యబిల్లు’ రూపంలో ప్రవేశపెట్టడం మీద ఇప్పటికే కొంత నిరసన వ్యక్తమవుతోంది. ద్రవ్యబిల్లు రూపంలో ప్రవేశపెట్టే బిల్లులకి సవరణలు చేసే అధికారం రాజ్యసభకు ఉండదు. ఆధార్‌కు చట్టబద్ధత కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు తప్పుదారి పట్టకుండా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇది పౌరహక్కులకు భంగమనీ, ఆధార్‌కు చట్టబద్ధత కల్పిస్తే దానిని దుర్వినియోగపరిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని విపక్షాలు మండిపడుతున్నాయి.

 

ప్రభుత్వ పథకాలను ఆధార్‌తో ముడిపెట్టేందుకే ఈ ఆధార్‌ బిల్లుని తీసుకుని వచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గ్యాస్ సిలండర్ల మీద రాయితీని ఆధార్‌తో అనుసంధానించడం వల్ల వేల కోట్ల రూపాయలు ఆదా చేశామని చెబుతోంది. మధ్యాహ్న భోజన పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆరోగ్యశ్రీ.... ఇలా ప్రతి పథకాన్నీ ఆధార్‌తో జోడిస్తే, సంక్షేమ పథకాలు అర్హులైనవారికి చేరతాయన్నది ప్రభుత్వ వాదన. కానీ వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఆధార్ కార్డుని పథకాలకి అర్హతా పత్రంగా కాకుండా గుర్తింపు పత్రంగా చలామణీ చేసే సంప్రదాయం ఇప్పటికే మొదలైంది. ఇప్పుడు బడిలో చేరే పసిపిల్లలకు కూడా ఆధార్ కార్డును అడుగుతున్నారు. ఎంసెట్‌ పరీక్షలు రాయాలంటే ఆధార్ తప్పనిసరి చేసేశారు. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, భూమిని అమ్ముకోవాలన్నా ఆధార్ అడ్డుపడుతూనే ఉంది. ‘ఆధార్‌ కార్డు లేకపోవడం వల్ల ఏ వ్యక్తీ నష్టపోకూడదు’ అని సాక్షాత్తూ సుప్రీంకోర్టే స్పష్టం చేసినా, ఆధార్‌ లేకపోతే మనుగడ కష్టం అనే పరిస్థితికి మనం వచ్చేశాము.    దేశంలో అక్రమంగా నివాసం ఉండేవారిని గుర్తించేందుకు ఆధార్‌ను ప్రవేశపెట్టారని, అది ఎక్కడ విమర్శలకు దారితీస్తుందో అని దానికి సంక్షేమపథకాల రంగుని పులిమారనీ విమర్శలు ఉన్నాయి. ఇప్పడు ఆధార్‌కు చట్టబద్ధత కల్పించడం వల్ల ఆ విమర్శలు మరోసారి పదునెక్కనున్నాయి.

 

అక్రమంగా నివాసం ఉంటున్నవారినే కాదు, దేశంలోని ప్రతి ఒక్కరి గురించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఆధార్‌ కల్పిస్తుంది. అవసరమైతే తప్ప ఆధార్‌ వివరాలను వెల్లడించబోమని ప్రభుత్వం చెబుతున్నా, ఆ ‘అవసరం’ అన్న పేరుతో మన వ్యక్తిగత జీవితంలోకి ప్రభుత్వం ప్రవేశించే అవకాశం ఈ బిల్లు కల్పిస్తోంది. ఒక వ్యక్తి ఏ పని చేసినా ఆధార్‌నే వాడుతూ ఉండాల్సి వస్తోంది కాబట్టి అతని కదలికలు, ఆర్థిక లావాదేవీలు, ఫోన్‌ రికార్డులు... ఇలా ఆధార్‌తో అనుసంధానమైన అతని జీవితం మొత్తాన్నీ గ్రహించి, వేధించే అవకాశాన్ని ఆధార్‌ కల్పించనున్నదన్నది ప్రధాన ఆరోపణ. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి ప్రమాదాలను కొట్టిపారేస్తోంది. ‘అవసరం’ అయితే తప్ప ఆధార్‌ వివరాలను వెల్లడించబోమని చెబుతోంది.


    
    ఎవరి వాదన ఎలా ఉన్నా ఆధార్‌ మన జీవితంలో భాగమైపోయిన మాట మాత్రం వాస్తవం. ఈ 12 అంకెల ఆధార్‌ ఇప్పుడు మన జీవితంతో ముడిపడిపోయి ఉంది. కాబట్టి అది దుర్వినియోగం కాకూడదనే ఆశిద్దాము. అన్నింటికీ మించి ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైనా ఆధార్‌ అనుసంధాన్ని చేపడుతోందో ఆ లక్ష్యం నెరవేరితేనే ఈ బిల్లుకి ఒక పరామార్థం. అలాకాకుండా.... డబ్బు, పలుకుబడితో ఏదైనా సాధించగలమని విర్రవీగే బడాబాబులు, తాము పేదలమంటూ ఓ ఆధార్‌ కార్డుని సంపాదించగలిగితే ఇక దాని ప్రయోజనం ఏముంటుంది!