సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కి భారీ ఎదురుదెబ్బ

 

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన తీర్పును అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఓఎంసీ కేసులో నిన్న  సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి గాలి జానర్దన్‌రెడ్డిని కోర్టు దోషిగా నిర్ధారించింది.

ఏ1 బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఏ3 అప్పటి గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, ఏ4 ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ, ఏ7 మెహఫుజ్‌ అలీ ఖాన్‌ (గాలి వ్యక్తిగత సహాయకుడు)లను దోషులుగా నిర్ధారించిన కోర్టు.. వీరికి ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. అలాగే ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది న్యాయస్థానం. సబితతో పాటు ఈకేసులో విశ్రాంత  ఐఏఎస్‌ కృపానందంను కూడా నిర్దోషిగా తేల్చింది. అయితే ఏ6గా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి హైకోర్టులో క్వాష్ పిటిషన్‌తో 2022లో ఈ కేసు నుంచి విముక్తి పొందిన విషయం తెలిసిందే. నిందితులకు ఒక్కొక్కరికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్‌కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ఓబుళాపురం మైనింగ్‌ కార్పొరేషన్‌కు రూ.2 లక్షల జరిమానా విధించారు. వేర్వేరు సెక్షన్ల కింద వేర్వేరుగా ఏడేళ్లు శిక్షలు పడినప్పటికీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో వెల్లడించారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu