‘ఐ’ మూవీ నిరాశ పరచిందా?

 

శంకర్, విక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఐ’ సినిమా బుధవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్, క్రేజీ కాంబినేషన్లతో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఒక్కోసారి ప్రేక్షకుల భారీ అంచనాలు కూడా కొన్ని సినిమాలకు శాపంగా పరిణమిస్తూ వుంటాయి. ఇప్పుడు ‘ఐ’ సినిమాకి కూడా అదే పరిస్థితి వచ్చిందా? ‘ఐ’ సినిమా చూసి వచ్చిన వాళ్ళు సినిమా అంతర్జాతీయ స్థాయిలో వుందని చెబుతున్నారు. పిల్లలయితే సినిమా సూపర్‌గా వుందని ఎగిరి గంతేసి మరీ చెబుతున్నారు. సంగీతంగానీ, చిత్రీకరణగానీ అదరహో అని పెద్దలు కూడా అంటున్నారు. ఇలాంటి సినిమాలు తీయాలంటే ఇండియాలో శంకరే సమర్థుడు అని కూడా అంటున్నారు. ఇక కథానాయకుడు విక్రమ్ గురించి అయితే ప్రశంసించనివాళ్ళు లేరు. అద్భుతమైన నటనను విక్రమ్ ప్రదర్శించాడని అంటున్నారు. అయితే తాము ఊహించిన స్థాయిలో సినిమా లేదని, తాము కొంతవరకు నిరాశకు గురయ్యామని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రథమార్థం కాస్త ఎక్కువగా లాగినట్టు కూడా అనిపించిందని అంటున్నారు. చాలా సన్నివేశాలు ఊహించిన విధంగానే వున్నాయని చెబుతున్నారు. ఇలా ప్రేక్షకులు కొంత నిరాశను వ్యక్తం చేసినప్పటికీ ఒక్కసారి చూడాల్సిన సినిమానే అని ‘ఐ’ని అంటున్నారు.