అదృష్టం- దురదృష్టం

అదృష్టం, దురదృష్టం అన్న మాటలను తరచూ వాడేస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న జీవితంలో ఏది అదృష్టమో, ఏది కాదో ఎలా చెప్పగలం. అందుకే మన పని మనం చేసుకుపోవడం, దాని ఫలితం తలకిందులైనప్పుడు కుంగిపోకుండా సాగిపోవడం విచక్షణ ఉన్న మనిషి లక్షణం. కావాలంటే ఈ చిన్న కథను చదివి చూడండి. దాదాపు వందేళ్ల క్రితం మాట ఇది. స్కాట్లాండులో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద పేరు క్లార్క్. కుటుంబం అంటే అందులో ఓ నలుగురో, ఐదుగురో ఉంటారనుకునేరు. క్లార్క్‌, అతని భార్యా... వారి తొమ్మిదిమంది పిల్లలు. ఆ తొమ్మిదిమంది పిల్లలతో బతుకు బండిని లాగడం భార్యాభర్తలకు చాలా కష్టంగా ఉండేది. అందుకని మంచి అవకాశాల కోసం అమెరికాకు చేరుకోవాలనుకున్నారు. మరి విదేశంలో స్థిరపడాలంటే మాటలా! అందుకోసం తగిన గుర్తింపు పత్రాలు, అనుమతి పత్రాలూ కావాలి. అన్నింటికీ మించి కుటుంబంలోని పదకొండు మందీ ప్రయాణించేందుకు టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. వీటి కోసం భార్యాభర్తలు తెగ కష్టపడేవారు. వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుని కావల్సిన పత్రాలను సంపాదించారు. రాత్రింబగళ్లూ పనిచేసి టికెట్లకు అవసరమైన డబ్బుని సంపాదించారు. తిండీతిప్పలూ మానేసి ఏళ్లకి ఏళ్లు కష్టపడితే కానీ ఇదంతా సాధ్యం కాలేదు. చివరికి ఫలానా రోజున అమెరికాకి ప్రయాణం అవ్వబోతున్నామన్న తీపి కబురుని తన కుటుంబానికి వినిపించాడు క్లార్క్‌. ఈ వార్త విన్న కుటుంబం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. కానీ...

మరో వారం రోజుల్లో ప్రయాణం ఉందనగా ఆ కుటుంబంలో అందరికంటే చిన్నపిల్లవాడిని కుక్క కరిచింది. వారుండే చోట ర్యాబిస్‌ మందు ఇంకా అందుబాటులో లేకపోవడంతో గాయానికి కుట్లు మాత్రమే వేసి వదిలేశాడు ప్రభుత్వ వైద్యుడు. పైగా అప్పటి నిబంధనల ప్రకారం, ర్యాబిస్ ప్రబలకుండా ఉండేందుకు మరో రెండువారాల పాటు ఆ కుటుంబం ఎక్కడికీ కదలడానికి వీల్లేదంటూ ఆజ్ఞలు జారీచేశాడు. ఇంకేముంది! ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉండిపోయింది. తమ టికెట్లని తిరిగి అమ్ముకునే అవకాశం కూడా లేకపోయింది. ఇంటిల్లపాదీ ఆ పిల్లవాడిని తిట్టుకుంటూ ఉండిపోయారు. ఈ రెండువారాల్లో ఆ పిల్లవాడికి కానీ, అతని నుంచి కుటుంబానికి కానీ ర్యాబిస్‌ అయితే సోకలేదు. కానీ నౌక, ఆ నౌకతో పాటు తమ టికెట్టు డబ్బులు తీరం దాటి వెళ్లిపోయాయి.రెండువారాలు గడిచాయి.... ఇంటిల్లపాదీ చిన్నబోయిన మొహోలతో ఊళ్లోకి వచ్చారు. కానీ తనకి ఎదురొచ్చిన ప్రతిఒక్కరూ శుభాకాంక్షలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు క్లార్క్‌. తమని వెక్కిరించేందుకే వారలా చేస్తున్నారని మొదట అనుకున్నాడు. కానీ అసలు విషయం తెలిసేసరికి అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. తాము ఎక్కుదామనుకున్న నౌక నడిసముద్రంలో మునిగిపోయిందనీ... అందులో దిగువ తరగతుల్లో ప్రయాణిస్తున్నవారు చాలామంది చనిపోయారనీ తెలిసింది. ఆ నౌక మరేదో కాదు... 1,500 మంది ప్రాణాలను బలిగొన్న టైటానిక్‌! ఇప్పుడు కార్ల్క్ దురదృష్టం కాస్తా అదృష్టంగా మారిపోయింది. క్లార్క్ పరుగుపరుగున వెళ్లి తన చిన్న కొడుకుని కావలించుకుని ఏడ్చేశాడు. తన కుటుంబం యావత్తునీ కాపాడావంటూ ముద్దులతో ముంచెత్తాడు. పాశ్చాత్య దేశాలలో క్లార్క్‌ కథ విస్తృత ప్రచారంలో ఉంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేవారెవ్వరూ లేరు. కానీ ఇలా జరిగే అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండటం, సజీవంగా ఉండటాన్ని మించిన అదృష్టం ఉందన్న విషయాన్ని ఎవరు మాత్రం నిరాకరించగలరు!


- నిర్జర.