డేటా చోరీ కేసు.. తెరవెనుక కీలక వ్యక్తి
posted on Mar 6, 2019 4:06PM
డేటా చోరీ కేసుపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పందించారు. హైదరాబాద్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రహస్యంగా ఉండాల్సిన సమాచారం ‘ఐటీ గ్రిడ్’ కు చెందిన సర్వర్ లో చేరిందని, దీని ద్వారా ఆ సమాచారాన్ని ‘సేవామిత్ర’ వాడుకుంటోందని తెలిపారు. సర్వర్లలో నిక్షిప్తం చేసిన డేటా ఇవ్వాలని అమెజాన్ సంస్థను కోరామని, ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు పంపినట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆధార్ నెంబర్, విద్య, సామాజికవర్గం వివరాలు సేకరిస్తున్నారని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్ పరిశీలిస్తోందని తెలిపారు. సేవా మిత్ర వెబ్‌సైట్‌లో బూత్ కన్వీనర్, డ్యాష్ బోర్డు వివరాలు ఉన్నాయన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ తమ సర్వేయర్ల ద్వారా ఓటర్లకు ఫోన్ చేసి ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగి తెలుసుకుంటారని వివరించారు. సర్వేయర్ల నుంచి సమాచారం టీడీపీ బూత్ లెవల్ నేతలకు వెళ్తుందన్నారు. ఓటర్ అభిప్రాయం, సదరు ఓటర్ అక్కడే ఉంటున్నారా? లేదా? అన్న దానిపై సర్వే చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లో నేరం జరిగింది కనుక, ఇక్కడే కేసు నమోదు చేశామని, ఫిర్యాదు చేసిన వ్యక్తి హైదరాబాద్‌లోనే ఉంటున్నారని తెలిపారు. నిందితుడు అశోక్ ను త్వరలో పట్టుకుంటామని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలక వ్యక్తి ఉన్నారని, ఆ వ్యక్తిని కోడ్ భాషతో పిలుస్తున్నారని, ఆ కోడ్ భాషను డీకోడ్ చేసి ఆ వ్యక్తి ఎవరన్నది త్వరలోనే తేలుస్తామని స్పష్టం చేశారు.