ఎన్నికల వేళ మోదీకి షాక్.. ఎప్పుడు లేనంతగా నిరుద్యోగ సమస్య
posted on Mar 6, 2019 3:32PM
దేశానికి ఎన్నో చేశామని చెప్పుకుంటున్న మోదీ సర్కార్ కి ఎన్నికలకు ముందు ఓ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. దేశంలో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో తెలిసిందే. అయితే మోదీ హయాంలో ఈ సమస్య మరింత పెరిగిందని తెలుస్తోంది. దేశంలో నిరుద్యోగానికి సంబంధించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) సంస్థ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2016 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు నమోదైన నిరుద్యోగ రేటును పరిశీలిస్తే.. 2019 ఫిబ్రవరిలో అత్యధికంగా 7.2శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. గతేడాది ఫిబ్రవరి నెలలో నిరుద్యోగ రేటు 5.9శాతం ఉండగా ఇప్పుడది మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా కొన్ని వేల ఇళ్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ సర్వే నివేదికను తయారుచేసినట్టు CMIE తెలిపింది.
ముంబైలోని థింక్ ట్యాంక్ సంస్థ ఛైర్మన్ మహేష్ వ్యాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది ఫిబ్రవరి నాటికి ఇండియాలో 406 మిలియన్ల ఉద్యోగస్తులు ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 400 మిలియన్లకే పరిమితమైంది. నిరుద్యోగానికి సంబంధించి కొన్ని వారాల క్రితం ఓ వార్తా పత్రిక కూడా కొన్ని లెక్కలను బయటపెట్టింది. సదరు పత్రిక బయటపెట్టిన వివరాల ప్రకారం.. దేశంలో గత 45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2017-18లో నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. భారత్లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. కానీ వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు, పలు నివేదికలు చెబుతున్నాయి.