ఒఎంసి కేసు: శ్రీలక్ష్మి పైకి నెట్టిన సబిత
posted on Apr 6, 2012 10:31AM
హై
దరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టయిన శ్రీలక్ష్మి కేసులో 8వ సాక్షిగా ఉన్న సబిత.. తనపై శ్రీలక్ష్మి తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారు. ఇంకా ఆమె తన వాంగ్మూలంలో మైన్స్ డైరెక్టర్‌గా రాజగోపాల్ తెలుసుననీ, పరిశ్రమల కార్యదర్శగా శ్రీలక్ష్మి నాకు తెలుసుననీ వెల్లడించారు. జీవోల విడుదలలో శ్రీలక్ష్మి అత్యుత్సాహం ప్రదర్శించారనీ, మైనింగ్ గురించి తనకు చెప్పకుండా ఓఎంసీకి అనుకూలంగా ప్రవర్తించారన్నారు. ఓఎంసీకి 25 హెక్టార్లు అదనంగా కేటాయించాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారనీ, దాంతో ఆ ప్రస్తావన తన వద్ద తేవద్దని చెప్పానన్నారు. ఐనా మరోసారి కేటాయింపులపై సంప్రదిస్తే గట్టిగా మందలించానని కూడా తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ముఖ్యంగా జీవోల విడుదల సమయంలో తను ముందుగా నోట్ లో పేర్కొన్న క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించి జీవోలు విడుదల చేయడం చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు.
అయితే, గనుల శాఖ సంచాలకునిగా, ఎపిఎండిసి ఎండిగా రెండు పోస్టుల్లో రాజగోపాల్‌ను దీర్ఘకాలం కొనసాగించడంపై తాను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లానని సబితా ఇంద్రా రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. ఈ విషయంలో పలు దఫాలుగా తాను వైయస్‌తో చర్చించానని ఆమె చెప్పారు. రాజగోపాల్ వద్ద ఉన్న రెండు పోస్టుల్లో ఒకదాంట్లో మరో అధికారిని నియమించాలని కోరానని, అయితే ఆయన స్థానంలో పని చేయడానికి మరో సమర్థుడైన అధికారి లేకపోవడంతో తప్పించలేక పోతున్నట్లు వైయస్ చెప్పారన్నారు. గనుల లీజుల మంజూరు కోసం అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మిపై వైయస్ ఒత్తిడి తెచ్చారనే విషయం తనకు తెలియదని చెప్పారు.
కాగా, శ్రీలక్ష్మి కేసులో సీబీఐ మొత్తం 13 మంది సాక్షులను చార్జిషీటులో చేర్చింది. సబితా ఇంద్రారెడ్డి 8వ సాక్షిగా ఉన్నారు. 2వ సాక్షిగా ఉన్న ఐఏఎస్ అధికారి అనిల్ సుబ్రహ్మణ్యం కూడా శ్రీలక్ష్మి ఆ క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించిన సంగతి నిజమేనని సాక్ష్యంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.