అసెంబ్లీకి తెలుగు తమ్ముళ్ల పాదయాత్ర ..దద్దరిల్లిన అసెంబ్లీ

హైదరాబాద్ : తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ ఘాట్ నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్రగా బయల్దేరారు. అంతకు ముందు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  విధులు నిర్వహించడంలో గవర్నర్ నరసింహన్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. గవర్నర్‌ నరసింహన్, కర్ణాటక గవర్నర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని బాబు సూచించారు. ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో ఎండగడతామన్నారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.

 
మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఎసిబి తన రిమాండ్ రిపోర్టులో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేరు చేర్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. రాష్ట్రంలోని దౌర్భాగ్య పరిస్థితికి కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన విమర్సించారు.  భూములపై వేసిన సభా సంఘంలో భిక్షం వేసినట్లు తమ పార్టీ నుంచి ఇద్దరిని మాత్రమే తీసుకున్నారని ఆయన విమర్శించారు. తమను సంప్రదించకుండా సభ్యుల పేర్లు ఖరారు చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. మరోవైపు టీటీడీపీ ఫోరం ఎమ్మెల్యేలు గన్‌పార్క్‌ దగ్గర తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లారు.


కాగా, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని బహిష్కరించాయి. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు తమ నిరసన తెలిపాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల జై తెలంగాణ నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి అసెంబ్లీ బయట మీడియా పాయింట్ వద్ద కింద కూర్చుని నిరసన కొనసాగిస్తున్నారు.