అసెంబ్లీలో నిరసనల హోరు..సీఎం తప్పించుకుంటున్నారు
posted on Feb 13, 2012 10:17AM
హైదరాబాద్ : టీఆర్ఎస్, టీడీపీ నిరసనలు, వాకౌట్ మధ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పాత అసెంబ్లీ హాల్‌లో శాసనసభ, శాసనమండలి సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రభుత్వ ప్రాధాన్యతల్ని గవర్నర్ తన 35 నిమిషాల ప్రసంగంలో చాటిచెప్పారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభించడానికి ముందే... టీఆర్ఎస్, టీడీపీ సభ్యుల నుంచి నిరసనలు మిన్నంటాయి. గవర్నర్ ప్రసంగం పత్రాల్ని విపక్ష సభ్యులు చించేశారు. వాటిని గవర్నర్‌పైకి విసిరే ప్రయత్నం చేశారు. నిరసనలు, నినాదాల మధ్య గవర్నర్ హడావుడిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. సభ నుంచి విపక్ష సభ్యులు బాయ్‌కాట్ చేశాక గవర్నర్ 'రిలాక్స్‌డ్' గా ప్రసంగాన్ని ముగించారు. కాగా గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి....తెలుగులోనే ముగించారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ అంశం ఢిల్లీ పరిధిలో ఉందని చెప్పి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పించుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తెరాస ఎమ్మెల్యేలు సోమవారం గన్ పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వచ్చే శుక్రవారం తాము అసెంబ్లీలో తెలంగాణపై ప్రైవేట్ తీర్మానం ప్రవేశ పెడతామని అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెసు వైఖరి బయట పడుతుందన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలపై కాకుండా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే కేంద్రంపై ఒత్తిడి పెంచినట్లవుతుందని సూచించారు. అసెంబ్లీలో రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావిస్తామన్నారు. కాంగ్రెసు తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చినందున గవర్నర్ ప్రసంగంలో ఆ అంశం ఉండాల్సిందేనని మరో నేత పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మా తెలంగాణ మేం పోరాడి సాధించుకుంటామన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం తీర్మానం ప్రవేశ పెట్టాలన్నారు.