అర్భన్ ఓటింగ్ భారీగా పెరిగింది.. సంకేతమేంటి?

సాధారణంగా ఓట్ల పండుగ పట్ల అర్బన్ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపరు. ఇన్నేళ్లుగా మనం చూస్తున్న ట్రెండ్ అదే. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి అర్బన్ ఓటింగ్ భారీగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 81.80 శాతం పోలింగ్ నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇది రెండు శాతం అధికం. ఇక అర్బన్ ఓటింగ్ లో   పెరుగుదల  విస్మయం గొలిపే విధంగా ఉంది. విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో అర్బన్ ఓటింగ్  అత్యధికంగా అత్యధికంగా 11.59శాతం పెరిగింది. అలాగే  విజయవాడ సెంట్రల్ లో 7.18శాతం, నెల్లూరు సిటీలో 6.3శాతం, కాకినాడ సిటీలో 5.78శాతం, విజయవాడ ఈస్ట్ లో 5.21శాతం ఇక గాజువాకలో 4.5శాతం చొప్పున ఓటింగ్ అధికంగా నమోదైంది. మొత్తం మీద రాష్ట్రంలో 35 అర్బన్ నియోజకవర్గాలు ఉంటే వాటిలో పాతికపైన నియోజకవర్గాలలో ఓటింగ్ శాతం పెరిగింది.

అర్బన్ ఓట్లలో పెరుగుదల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఈ సారి ఒక కొత్త రికార్డు నమోదు చేసిందని చెప్పవచ్చు. ఇక ఓవరాల్ పోలింగ్ విషయంలో కూడా సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన నాలుగు దశలలో దేశం మొత్తంలోనే ఓటింగ్ శాతంలో ఏపీ నంబర్ వన్ గా నిలిచింది. అదొకటి అలా ఉంచితే అనూహ్యంగా అర్బన్ ఓటింగ్ పెరగడం పరిశీలకులనే విస్మయపరిచింది.  జగన్ సర్కార్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణంగా ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలున్నాయని ముందునుంచీ అందరూ ఊహించిందే అయినా అర్బన్ ఓటింగ్ పెరుగుదల మాత్రం ఎవరి ఊహలకూ అందలేదనే చెప్పాలి. 

ఎందుకంటే అర్భన్ ఓటర్లలో అత్యధికులు ఉద్యోగులు, వ్యాపారులు ఉంటారు. వారు సాధారణంగా పోలింగ్ బూత్ లకు వచ్చి క్యూలైన్ లో నిలుచుని ఓటు వేయడానికి పెద్దగా ఉత్సాహం చూపరు. కానీ ఈ సారి మాత్రం పొద్దుటే పోలింగ్ బూత్ లకు తరలివచ్చి గంటల తరబడి క్యూలైన్ లో తమ వంతు వచ్చే వరకూ ఓపికగా వెయిట్ చేసి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అన్న ప్రశ్నకు పట్టణ ప్రజలలో జగన్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తం కావడం వల్లనేనని పరిశీలకులు బదులిస్తున్నారు. అర్బన్ ఓటర్లలో అత్యధికులు వ్యాపారాలు చేసుకునే వారు, ఉద్యోగులు, యువత ఉంటారు. వీళ్లందరిలో వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్యుత్, పెట్రోల్ చార్జీల పెరుగుదల, అలవిమాలిన పన్నులు ఇవన్నీ పట్ణణ ప్రాంత ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రోది చేశారు. దీంతో వారు ఎలాగైనా జగన్ ను ఓడించాలన్న కంకణం కట్టుకున్నారు. దీంతో గతానికి భిన్నంగా వారు పట్టుదలగా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  సాధారణంగా ఓటింగ్ శాతంలో పెరుగుదల  ప్రజలలో తీవ్రంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను సూచిస్తుంది. ఏపీలో కూడా అదే జరిగింది.