పార్టీ క్యాడర్ ను పట్టించుకోని జగన్!.. సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసిన వైసీపీ కార్యకర్త
posted on Dec 27, 2024 9:16AM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం నుంచీ, గతంలో తాను చేసిన తప్పుల నుంచీ గుణపాఠం నేర్చుకోలేదు. అత్యంత అవమాన కరరీతిలో జనం ఆయన పార్టీని ఎన్నికలలో ఓడించిన తరువాత కూడా గతంలో చేసిన తప్పులనే పునరావృతం చేస్తున్నారు. దీంతో సొంత పార్టీ క్యాడర్ కూడా ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. నిరసన వ్యక్తం చేస్తున్నది. పులివెందులలో గురువారం (డిసెంబర్ 26) ఆయన నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన సొంత క్యాడర్ నుంచే నిరసన ఎదుర్కొన్నారు. సొంత నియోజకవర్గంలో జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదు.
జగన్ పార్టీ కార్యకర్తలను విస్మరించడమే ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణమని వైసీపీ నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయాన్ని ఓటమి తరువాత ఆయన దృష్టికీ తీసుకువెళ్లారు. అయితే జగన్ మాత్రం పార్టీ ఓటమికి తెలుగుదేశం కూటమి అసత్య ప్రచారం, ఈవీఎంల టాంపరింగే కారణమంటూ అస్మదీయుల హితవచనాలను పక్కన పెట్టేశారు. పార్టీ అధికారంలో ఉండగా ప్రజల దృష్టిలో భ్రష్టులుగా ముద్రపడిన గోరంట్ల మాధవ్ వంటి వారికి ఇప్పుడు పార్టీ పదవులు కట్టబెడుతూ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరు పార్టీకి క్యాడర్ ను దూరం చేస్తున్నది. ఇందుకు రుజువుగా గురువారం (డిసెంబర్ 26) పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో పార్టీ క్యాడర్ ను కూడా జగన్ కలవడానికి సుముఖంగా లేరంటూ వైసీపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.
జగన్ కు కలిసేందుకు పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో ఉదయం ఏడు గంటలకే పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వారికి ఆయన దర్శన భాగ్యం దక్కలేదు. వర్షాన్ని లెక్క చేయకుండా జగన్ ను కలసేందుకు తిండితిప్పలను కూడా విస్మరించి క్యూలైన్ లో వేచి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో పార్టీ క్యాడర్ లో అసహనం పెల్లుబికింది. జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్నంతా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వైసీపీ కార్యకర్త జగన్ తీరుపై విమర్శలు గుప్పించడం పార్టీ క్యాడర్ జగన్ తీరు పట్ల ఎంత అసహనంతో ఉన్నారో తేటతెల్లం చేసంది.