జగన్ వదిలేశారు.. జనం ఛీకొట్టారు.. పెద్దిరెడ్డి పరిస్థితేంటి?
posted on Dec 27, 2024 10:15AM
అధికారం అండతో మంచి , చెడు, ఉచ్ఛం, నీచం అని లేకుండా తెగించి అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఇప్పుడు అన్ని దిక్కుల నుంచీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. పెద్దిరెడ్డి పాపాల పుట్టలు అన్నీ పగులుతున్నాయి. వైసీపీ అధికారంలో కొనసాగిన ఐదేళ్ల కాలంలో మంత్రి హోదాలో పెద్దిరెడ్డి పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దిరెడ్డి దోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అటు పార్టీలోనూ ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయింది. దీంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. జగన్ హయాంలో జగన్ రెడ్డి లిక్కర్ వ్యాపారాన్ని.. ఢిల్లీలో జగన్ వాయిస్ ను తనకు చేతనైన రీతిలో నిర్వహించిన ఆయన కుమారుడు మథున్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే తయారైంది. జగన్ కూడా వారిరువురినీ పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే వారికి ఇచ్చిన పార్టీ పదవులను జగన్ పీకేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి పార్టీలో నెంబర్ 2గా ఓ వెలుగు వెలిగారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల బాధ్యతలను జగన్ ఆయనకే కట్టబెట్టారు. అయితే ఎన్నికలలో ఆ రెండు జిల్లాల్లోనూ వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, ఆయన కుమారుడు మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు. ఇక ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మిగిలిన వారంతా ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీకావు. అంగళ్లులో చంద్రబాబును చంపడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేశారని అనుమానాలున్నాయి. ఆ రోజు చంద్రబాబు పర్యటనలో పోలీసులు వ్యవహరించిన విధానం, పుంగనూరు వద్ద జరిగిన అల్లర్లలో పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఇక అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి పాల్పడిన ఆర్థిక అరాచకాలకు అంతే లేదు. దీంతో రాజకీయంగా యాక్టివ్ గా ఉంటే అవన్నీ బయటకు వస్తాయన్న భయంతో ఆయన పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జగన్ కూడా పెద్దిరెడ్డిని పక్కన పెట్టేయడంతో ఆయన జిల్లాకు ముఖం చాటేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద అధికారం అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి ఇప్పుడు దాదాపుగా అజ్ణాత వాసం చేస్తున్నారు. పార్టీ నుంచి కూడా అండ కరవవ్వడంతో చేసిన తప్పులకు ఎప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తుందో అన్న భయంతో కాలంగడుపుతున్నారని చెప్పవచ్చు.